వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం!

by Harish |
వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన కొద్ది రోజులుగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా సురక్షిత పెట్టుబడిగా ఎక్కువమంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవడంతో బంగారం ధరలు భగ్గుమన్నాయి. అయితే, అక్షయ తృతీయ తర్వాత వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గాయి. మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతుండటం, అంతర్జాతీయంగా అనేక దేశాలు లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే సడలింపులను ఇస్తుండటంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఎమ్‌సీఎక్‌లో 10 గ్రాముల బంగారం రూ. 286 వరకూ తగ్గి రూ. 45,905 వద్ద ఉంది. వెండి సైతం కిలోకు రూ. 400 క్షీణించి రూ. 41,558కి చేరుకుంది. పలు కరెన్సీలతో పోలిస్తే యూఎస్ డాలరు మారకం విలువ పెరగడంతో బంగారం ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, బంగారం రికార్డు స్థాయిలో పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం ధరలు క్షీణించడానికి కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలు కోలుకునేలా అవసరమైన ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తుండటంతో పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోలు వైపు వెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం బంగారంపై ఆసక్తి సన్నగిల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో బంగారం నిలకడగానే పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.

Tags : Gold Rate, Gold, Covid, U.S. Gold, Coronavirus, Silver

Advertisement

Next Story

Most Viewed