మీరొద్దు.. మీ సర్వేలొద్దు వెళ్లిపోండి.. సెర్ప్ సిబ్బందికి చీవాట్లు

by Shyam |
మీరొద్దు.. మీ సర్వేలొద్దు వెళ్లిపోండి.. సెర్ప్ సిబ్బందికి చీవాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా సెకండ్​వేవ్​విజృంభిస్తోంది. ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేస్తోంది. అటు కోర్టులు కూడా ఆగ్రహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నింటా రోటేషన్​పద్ధతిలో ఉద్యోగులు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు సిబ్బందిని కలువడం లేదు. ఫైళ్లు పట్టుకుని కూడా రానీయడం లేదు. ఐఏఎస్‌లు, హెచ్‌ఓడీలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. మండల స్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా అదే పరిస్థితి. చాలా గ్రామాలు సెల్ఫ్​లాక్‌డౌన్​విధించుకున్నాయి. ఈ సమయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) వింత నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 50 లక్షల మంది మహిళల దగ్గరకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశించింది. బంధువులనే ఇంటి చుట్టుపక్కలకు రానీయకుండా ఉన్న ఈ సమయంలో సెర్ప్​సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని ఆదేశాలివ్వడంపై మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

వివరాలున్నా… ఇదేం సర్వే

రాష్ట్రంలో మహిళా సంఘాలు, సంఘంలోని ప్రతీ మహిళ వివరాలు గ్రామీణాభివృద్ధి శాఖలో నిర్లిప్తమై ఉన్నాయి. ఇటీవల కరోనా రుణాల పేరిట మహిళలకు సమాచారం లేకుండానే రూ.5వేల చొప్పున వారి ఖాతాల్లో వేశారు. ఇలాంటి పూర్తి వివరాలు సెర్ప్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు చేయి దాటింది. వేల కేసులు పాజిటివ్​ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెర్ప్​ సిబ్బంది.. ప్రతి మహిళ ఇంటికి వెళ్లి సమాచారం తీసుకుని ఫోటోలతో సహా కంప్యూటర్లలో నమోదు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవంగా ఇటీవల వేతనాలు, ఇతర సమస్యలపై ప్రిన్సిపల్​సెక్రెటరీని కలిసేందుకు ప్రయత్నించిన సెర్ప్​ఉద్యోగ జేఏసీ ప్రతినిధులకు సమయం ఇవ్వడం లేదు. కరోనా ఉందంటూ రానీయడం లేదు. ఇద్దరు ప్రతినిధులను కలిసేందుకే సమయమివ్వని పరిస్థితులుంటే.. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి సర్వే ఎలా చేస్తామంటే ప్రశ్నిస్తున్నారు.

రికార్డు ప్రకారం రాష్ట్రంలో మొత్తం 46 లక్షల సంఘాల్లో దాదాపుగా 50లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు వీరందరి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మళ్లీ మొదటి నుంచి వివరాలు ఎంట్రీ చేయాలని, ఇది వరకు ఉన్నా వివరాల్లో లోపాలు ఉన్నాయా.. లేదా మరోసారి చెక్​ చేసుకోవాలని, మొత్తం 50లక్షల మంది సభ్యుల ఇంటింటికీ వెళ్లి వారిని ముఖాముఖి కలిసి, వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు, ఫోన్ నెంబర్‌తో పాటు వారి సంఘం పూర్తి వివరాలు సభ్యులతో మాట్లాడి తీసుకుని ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలంటూ పనిలేని పనిని అప్పగించారు. అంతేకాకుండా సభ్యురాలిని మాస్క్​లేకుండా ఫోటో తీసుకోవాలని సూచించారు. ఈ సమాచారమంతా ఈ నెల 27లోగా సేకరించాలని, సర్వేను పూర్తి చేయాలంటూ ఆదేశాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీరు రాకండి..

కొన్ని చోట్ల ఈ ప్రక్రియ మొదలుపెట్టగా చాలా మంది మహిళా కుటుంబాలు సెర్ప్​ఉద్యోగులు రావద్దంటూ కరాఖండిగా చెప్పుతున్నాయి. అసలే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సర్వే వద్దు.. మీ వివరాలు వద్దూ.. వెళ్లిపోండి అంటూ చెప్పుతున్నారు. కనీసం వివరాలు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు సెర్ప్‌లో దాదాపు 500 మంది సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. ఇటీవలే నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి ఏపీఎం, ఆదిలాబాద్​జిల్లా సీసీ కరోనాకు బలయ్యారు. పాజిటివ్​ వచ్చిన వారికి కనీసం సెలవులు కూడా ఇవ్వడం లేదు. ఈ సమయంలో సర్వే చేయలేమంటూ చెప్పుతున్నా.. అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

వెంటనే నిలిపివేయాలి : సెర్ప్​ జేఏసీ

ప్రభుత్వం చేపట్టిన మహిళా సంఘాల సర్వేను వెంటనే నిలిపివేయాలని సెర్ప్​ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సయ్, సుభాష్, మహేందర్​రెడ్డి, సుదర్శన్​ విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీ కవితకు విన్నవించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వే చేయలేమంటూ విన్నవించారు. కరోనా పాజిటివ్​తో బాధపడుతున్న సిబ్బందిని ఆదుకోవాలని, మరణించి వారికి పరిహారం ఇవ్వాలని, మెడికల్​ సెలవులు మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు విన్నవించామని, కానీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed