హైదరాబాద్‌కి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

by Anukaran |
హైదరాబాద్‌కి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ, ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కె.తారక రామారావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా కంపెనీ రూ.1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీ 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందన్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.50 లక్షల చ.అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.170 ఏండ్ల వాణిజ్య, వ్యాపార చరిత్ర కలిగిన ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన మాస్ మ్యూచువల్ తన గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడం హర్షదాయకమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మాస్ మ్యూచువల్ ఇండియా కంపెనీ హెడ్ రవి తంగిరాల మాట్లాడుతూ “హైదరాబాద్ నగరానికి తమ కంపెనీ రావడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రో ఆక్టివ్ పాలసీల వల్ల హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కంపెనీ 1851లో ఏర్పాటై కోట్లాది మందికి ఆర్థిక సేవలను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సపోర్ట్, ఇంజినీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అమెరికాలో తమ కంపెనీకి 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని రవి తంగిరాల తెలిపారు. కంపెనీ కోర్ టెక్నాలజీ హెడ్ ఆర్థర్ రీల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed