చలికి తోడుగా కరోనా.. మరి ఓట్లు పడేనా?

by Anukaran |   ( Updated:2020-11-30 08:49:19.0  )
చలికి తోడుగా కరోనా.. మరి ఓట్లు పడేనా?
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: నిండు చ‌లి కాలంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థుల‌కు చెమ‌టలు ప‌డుతున్నాయి. ఓ వైపు చ‌లి, మ‌రో వైపు క‌రోనా వీరి ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైంది. మంగ‌ళ‌వారం జ‌రుగనున్న పోలింగ్‌కు ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఓట‌ర్లు ఎంత మేర‌కు పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటార‌నేది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌ని విధంగా ఉంది. క‌రోనా ప్ర‌భావం మొద‌లైన అనంత‌రం హైద‌రాబాద్ న‌గ‌రంలో తొలిసారిగా గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా ఓటింగ్ ఎంత శాతం న‌మోదు అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 2016 సంవ‌త్స‌రంలో జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మొత్తం హైద‌రాబాద్ న‌గ‌రంలోని 150 డివిజ‌న్ల‌లో 74,23,980 మంది ఓట‌ర్లు ఉండ‌గా వీరిలో 45.27 శాతంతో 33,60,543మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

60 ఏండ్ల పైబ‌డిన వారు ఓటు హ‌క్కు వినియోగించుకునేనా….?

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లో 60 ఏండ్ల‌కు పై బ‌డిన వారు ఎంత మేర‌కు ఓటు హ‌క్కు వినియోగించుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చ‌లిలో క‌రోనా వేగంగా వ్యాపిస్తుంద‌ని, సీనియ‌ర్ సిటిజెన్ల‌పై క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగ‌డంతో అన్ని పార్టీ‌ల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. గ‌తంలో జీహెచ్ఎంసీకి జ‌రిగిన ఎన్నికల పోలింగ్ శాత‌మైనా న‌మోదౌతుందా ? లేదా అనేది అంద‌రిలో ఆస‌క్తిని క‌ల్గిస్తోంది.పోలింగ్ త‌గ్గితే ఏ పార్టీ విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తింటాయి ? పెరిగితే ఎవ‌రికి లాభం ,న‌ష్ట‌మెవ‌రికి అనేది తేల్చుకునేందుకు అభ్య‌ర్థులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

Advertisement

Next Story