కేటీఆర్‌ మాట లెక్కచేయని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్

by Anukaran |
కేటీఆర్‌ మాట లెక్కచేయని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్
X

దిశ, సిటీ బ్యూరో: మహానగర పాలక సంస్థలో అధికారులు, పాలక మండలి మధ్య దేవుడే దిగొచ్చినా సమన్వయం కుదిరేలా లేదు. అధికారులు, పాలక మండలి, కార్పొరేటర్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్, సంబంధిత విభాగాధిపతికి తెలియకుండానే నిర్వహిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఇంజినీర్లకు మెమోలు జారీ చేసిన కమిషనరే.. మేయర్ కార్యక్రమాలకు హాజరుకాకపోవటం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మేయర్‌కు తెలియకుండా జరిగిన ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇంజినీర్లపై సీరియస్ అయిన కమిషనర్.. వారిని వివరణ కోరారు. కానీ, ఆయన మాత్రం మేయర్ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. మంగళవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో విజయలక్ష్మీ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ (పారిశుద్ధ్య కార్మికుల)కు ఆరోగ్య పరిరక్షణ కోసం.. బుధవారం సుమారు రూ.10.08 కోట్ల విలువైన పీపీఈ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా కమిషనర్ హాజరుకాలేదు.

నగరంలో వర్షం కురిసినపుడు, ప్రజల సమస్యలను పరిష్కరించటంలో, నగరాన్ని వరదల ముంపు నుంచి కాపాడేందుకు చేపట్టిన నాలాల పూడికతీత పనులను మేయర్, కమిషనర్ కలిసి సమిష్టిగా తనిఖీలు చేయాలని కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్‌‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అయినా.. ఇప్పటి వరకు మేయర్, కమిషనర్ ఈ పనులను తనిఖీ చేసిన సందర్భాల్లేవు. అసలు విషయానికొస్తే.. కార్పొరేషన్‌లో ప్రజల పక్షాన మేయర్, అధికారుల పక్షాన కమిషనర్‌ల భాగస్వామ్యం కరవైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా మున్సిపల్ మంత్రి ఆదేశించినా వీరిద్దరు కలిసి గానీ, వేర్వేరుగా గానీ పనుల తనిఖీలు చేయకపోవటంతో.. పాలక మండలి, అధికార యంత్రాంగాల మధ్య దూరం పెరుగుతుందనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అంతేగాక, వీరిద్దరి మధ్య సమన్వయం అనేది లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed