డిసెంబరులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు?

by Shyam |   ( Updated:2020-08-28 22:07:58.0  )
డిసెంబరులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు?
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రభావమెంతో, గెలుపు ఓటముల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సర్వే చేస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై ఈ సర్వే జరుగుతోంది. మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ప్రైవేటు సంస్థతో నిర్వహించిన సర్వేలో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినందున మరింత స్పష్టత కోసం ఈసారి ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రస్తుతం పనిచేస్తున్నడివిజన్ కార్పొరేటర్లు ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు ఏ మేరకు చేరవేయగలిగారు, టీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా ఒక్కో డివిజన్‌లో ఉన్న పలుకుబడి, ప్రజాదరణతో పాటు ఇప్పుడు కొనసాగుతున్న కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ఇన్‌చార్జిల పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే మూడు అంశాలపై ఇంటెలిజెన్స్ సిబ్బంది వివరాలను రాబడుతున్నారు.

ఈ నివేదిక వచ్చిన తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే చేయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో వంద సీట్లను లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేయగా ఒక్క స్థానం మాత్రమే తక్కువగా వచ్చింది. ఈసారి మాత్రం వందకు పైగానే స్థానాలు వస్తాయని మొదటి దఫా ప్రైవేటు సర్వే ఫలితాలు ఇచ్చినందున ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా కూడా మరింత లోతైన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఫలితాలను బట్టి ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగూ మంత్రులు, మేయర్ తదితరులంతా నగరంలో కరోనా ఒకవైపు ఉండగానే మరోవైపు అభివృద్ధి పనులు, రోడ్లు వేయడం, బస్తీ దవాఖానాలను ప్రారంభించడం, అంబులెన్సులను రంగంలోకి దించడం, ఫ్లై ఓవర్‌లు, స్టీల్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాలు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపైన మంత్రి కేటీఆర్, మేయర్ తదితరులు రివ్యూ చేసి ప్రకటన జారీ చేయడం కూడా ఇందులో భాగమే.

జనవరి చివరి వారంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా డిసెంబరులోనే నిర్వహించడంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టంగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందనే అంశంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉన్నందున వీలైనంత త్వరలో ఆ పోస్టులో సరైన వ్యక్తిని నియమించేందుకు కూడా అధికారులు, సలహాదారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు నగరంలోని కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తోంది. పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అయినా తెలంగాణ బిడ్డగా దేశానికే గర్వకారణంగా నిలిచారనే సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా వాడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యపోయేంతగా శతజయంతి ఉత్సవాలను నిర్వహించడంపై పత్రికల ద్వారా విశేష ప్రచారాన్ని చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోడానికి వీలు లేనంతగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఇంటెలిజెన్స్ విభాగం చేసే సర్వేలో వచ్చే ఫలితాలకు అనుగుణంగా వ్యూహంలో మార్పులు చేర్పులు చేసి గతం కంటే మెరుగైన ఫలితాలను రాబట్టాలనుకుంటోంది. అభ్యర్థులను మార్చడం, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులకు అవకాశం ఇవ్వడం, ప్రజల నాడికి అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లాంటివన్నీ రానున్న కాలంలో అమలు చేయాలనుకుంటోంది. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, టీఆర్ఎస్ ఎక్కడ బలహీనంగా ఉంది, దానికి కారణాలేంటి, బలం పెంచుకోడానికి అవలంభించాల్సిన విధానమేంటి, ప్రజలు కోరుకుంటున్నవాటిని అందించడం ఎలా? ఇలా అనేక అంశాలపై కసరత్తు చేయాలని భావిస్తోంది.

ఏ ఎన్నికలైనా ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు వివిధ సంస్థలు నిర్వహించే సర్వే ఫలితాలను బేరీజు వేసుకునే టీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాన్నే అమలు చేస్తున్నారు. వారం రోజుల తర్వాత ఇంటెలిజెన్స్ సమర్పించే నివేదిక తర్వాత నగరానికి ఇకపైన నిధుల విడుదల, కొత్త ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రకటనలు చేయనుంది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపును మంత్రి కేటీఆర్ తన భుజాలపై వేసుకోనున్నారు.

Advertisement

Next Story