చివరి త్రైమాసికంలో జీడీపీ సానుకూలం !

by Harish |   ( Updated:2020-12-03 07:31:58.0  )
చివరి త్రైమాసికంలో జీడీపీ సానుకూలం !
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి సానుకూలంగా మారుతుందని పరిశోధనా సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ 1 నుంచి 2 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని, మార్చి త్రైమాసికంలో సానుకూలానికి చేరుకుంటుందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది. గురువారం విడుదల చేసిన ‘ఎకోస్కోప్’ నివేదికలో..కొవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ ప్రమాదం ఇంకా ఉందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

స్థూల విలువ ఆధారిత సూచీ, ఆర్థిక కార్యకలాపాల సూచీలు అక్టోబర్ నెలకు సంబంధించి 4.8 శాతం వృద్ధి చెందాయి. ఈ సూచీలు సెప్టెంబర్‌లోనూ సానుకూలంగానే నమోదయ్యాయని, పారిశ్రామిక, సేవల రంగాలు వ్యవసాయం కంటే మెరుగ్గా, వేగంగా కొనసాగుతున్నాయని నివేదిక తెలిపింది. వాస్తవ జీడీపీ గణాంకాల వెళ్లడికి ముందు మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి స్వల్ప ప్రతికూలతను నమోదు చేయవచ్చని, నాలుగో త్రైమాసికంలో సానుకూల వృద్ధిని చూడగలమని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. అదేవిధంగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి ప్రతికూలంగానే ఉండొచ్చని అంచనా వేసింది.

Advertisement

Next Story