నేటి నుంచే అమల్లోకి గెజిట్​

by  |   ( Updated:2021-10-13 22:42:32.0  )
AP-TS Water Disputes
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో కీలకమైన ప్రక్రియ మొదలుకానుంది. ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకువస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్​ గురువారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు, అవుట్​ లెట్లు బోర్డుల పరిధిలోకి రానున్నాయి. అయితే బోర్డుల పరిధికి ప్రాజెక్టులు అప్పగించడంపై ఏపీ అంగీకారం చెప్పుతున్నా.. ఇంకా తెలంగాణ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. వరుసగా మూడు రోజుల పాటు జరిగిన బోర్డులు, ఉప సంఘాల సమావేశంలో గెజిట్​ అమలును వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు.. సీఎం కేసీఆర్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఆమోదం తర్వాతే తమ నిర్ణయం చెప్పుతామంటూ బోర్డుల భేటీలో స్పష్టం చేశారు. అయితే కామన్​ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్​ అంశంలో మాత్రం రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నట్లు అటు బోర్డులు ప్రకటించాయి. అంతేకాకుండా గెజిట్​ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాతే పూర్తిస్థాయి నిర్వహణ రానుంది.

ఈ ప్రాజెక్టులే ముందు

గోదావరి నదిపై పెద్దవాగు, కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులను బోర్డు పరిధికి తీసుకునేందుకు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. శ్రీశైలం, సాగర్​లోని 29 అవుట్​లెట్లను నిర్ధారించారు. దీనిపై ఇటీవల జరిగిన సమావేశాల్లో అంగీకారం చెప్పినట్లు బోర్డులు ప్రకటించాయి. అయితే విద్యుత్​ ప్రాజెక్టులపై ఏపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ మాత్రం వాదనకు దిగింది. అసలు రాష్ట్రాల సమ్మతి లేకుండా బోర్డు పరిధికి తీసుకునే హక్కు లేదంటూ ఇప్పటికీ చెప్పుతోంది.

వాస్తవానికి కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు కట్టబెడుతూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించగా రెండు రాష్ట్రాల్లోని నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్‌లో చేర్చింది. షెడ్యూల్‌– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు 100 శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుల్లోని ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్‌ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకొని రోజువారీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో కేంద్రం భద్రత కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. బోర్డులు తాము స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్‌–1లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో ఏవైనా కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది. షెడ్యూల్‌–3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది.

కాగితాల్లోనే గెజిట్​

గెజిట్​ అమలు నేపథ్యంలో చాలా అంశాలపై స్పష్టత రాలేదు. ముందుగా ప్రాజెక్టులను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఇదే సమయంలో గెజిట్​ అమలు కానున్న నేపథ్యంలో బోర్డుల పరిధికి వెళ్లినా నామమాత్రమే కానున్నాయని ఇరిగేషన్​ వర్గాలు చెప్పుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు బోర్డుల పరిధికి వెళ్లినా.. దాదాపు రెండు నుంచి మూడు నెలలు సంధికాలం ఉంటుందని గెజిట్​లో వెల్లడించారు. అంటే అప్పటి వరకు పలు అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు నిర్వహణ ఎలా ఉంటుందనేది బోర్డులు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు ఒకవేళ గెజిట్​ అమల్లోకి వచ్చినా.. రెండు రాష్ట్రాలు ఆమోదం ఇచ్చేదాకా బోర్డులు చేసేదేమీ ఉండదన్నట్టే. అంతేకాకుండా ప్రాజెక్టులపై కేంద్ర బలగాల భద్రతపై జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా పలు అంశాలను తేల్చింది. కేవలం వివాదాలు మొదలైతేనే ఈ ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేయనున్నారు. అంతేమినహా సాధారణ రోజుల్లో అవసరం లేదని వెల్లడించారు.

కృష్ణాలోః శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, ఎడమ, కుడి గట్టు విద్యుత్‌ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, బంకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్‌ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్‌ఎస్‌ఎస్, నాగార్జునసాగర్‌ పరిధిలో సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్‌ కెనాల్‌లు, ఏఎంఆర్‌పీ, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, సాగర్‌ టెయిల్‌పాండ్, తుంగభద్ర, దాని పరిధిలోని హైలెవల్, లోలెవల్‌ కాలువలు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్‌ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్‌ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు–పాకాల ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంప్‌హౌస్, ఎస్సారెస్పీ స్టేజ్‌–2లోని మైలవరం రిజర్వాయర్, వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్‌ఎంసీ–ఎన్‌ఎస్‌–ఎల్‌ఎంసీ లింకు, పోలవరం–కృష్ణా లింకు, కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్‌.

గోదావరిలోః పెద్దవాగు రిజర్వాయర్‌ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు, హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తపట్టణం ఎత్తిపోతలు, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి, తొర్రిగడ్డ ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, చాగలనాడు ఎత్తిపోతలు, వెంకటనగరం ఎత్తిపోతలు, శ్రీరాంసాగర్‌ స్టేజ్‌–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు (అదనంగా రోజుకు ఒక టీఎంసీ), చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకులగూడెం బ్యారేజి, ముక్తేశ్వర్‌ ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల, మాచ్‌ఖండ్‌ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లు.

Advertisement

Next Story