అది అంత ఈజీ కాదంట.. పోలీసులు అనుకుంటున్రు!

by Sumithra |   ( Updated:2020-06-08 00:30:08.0  )
అది అంత ఈజీ కాదంట.. పోలీసులు అనుకుంటున్రు!
X

దిశ, క్రైమ్‌ బ్యూరో: నగరంలో ముఠా కక్షలు పడగవిప్పుతున్నాయి. చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న ముఠాలు తిరిగి జూలు విప్పుతున్నాయి. అనుకూలమైన టైం చూసుకొని పాత కక్షలను తిరగదోడుతున్నాయి. ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడేలా ఒకే రోజు 4 హత్యలు చోటు చేసుకున్నాయి. అందులో డబుల్ మర్డర్ సంచలనమైంది. దీంతో నగరంలో ఆర్థిక లావాదేవీలలో రౌడీ షీటర్ల పాత్ర కొనసాగుతుందనే విషయం మరోసారి రుజువైంది. నడి రోడ్డుపై దుండగులు కత్తులతో వీరంగం చేసిన ఘటన నగర వాసులనలు బెంబేలెత్తిస్తుండగా రౌడీషీటర్లను కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.

పాత కక్షలు.. లావాదేవీలే కారణం

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. నడిరోడ్డుపై ప్రాణం పోయే వరకూ కత్తులతో పొడిచి వీరంగం సృష్టించిన ఘటన మరోసారి పాతబస్తీ గత స్మృతులను గుర్తు చేస్తోంది. గోల్కొండ సమీపంలో నివసించే చాంద్ తన స్నేహితుడు అబూతో కలిసి బైక్ పై వెళ్తుండగా, ఆరుగురు రౌడీ షీటర్లు వెంటాడి, వేటాడి కత్తులతో దారుణంగా హత్య చేశారు. మృతుడిగా భావిస్తున్న చాంద్ పోలీసు రికార్డుల్లో రౌడీ షీటర్‌గా నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్‌ను హత్య చేసేందుకు ఎప్పట్నుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. లాక్ డౌన్‌లో ముంబయికి వెళ్లి సడలింపులతో తిరిగి హైదరాబాద్ వచ్చిన చాంద్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోనూ ఏప్రిల్‌లో ఓ మర్డర్ జరిగింది. ఇందుకు ఆర్థిక లావాదేవీలే కారణం. 2019 డిసెంబర్‌లో కామాటిపురా పీఎస్ పరిధిలో ముఠాల గొడవల కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు. దాంతో మృతుని సోదరుడు కక్ష పెంచుకుని తన అన్నను చంపిన వారిని 2020 జనవరిలో హత్య చేశాడు.

పాతబస్తీలో 400 పైగా రౌడీ షీటర్లు

నగరంలో శుక్రవారం జరిగిన డబుల్ మర్డర్‌తో ఒక్కసారిగా రౌడీ షీటర్ల టాపిక్ తెరపైకొచ్చింది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మర్డర్ అయితే, తెల్లవారు జామున 3.30 గంటల కల్లా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. కానీ, అదే స్థాయిలో రౌడీ షీటర్లను అదుపు చేయడం అంత ఈజీ కాదు అనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ హత్యలన్నీ క్షణికావేశంతో చేసినవి కావనీ, పాత కక్షల కారణంగానే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్లను ఎలా అదుపులోకి తీసుకురావడం అనేది పోలీసులకు పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. కేవలం పాతబస్తీలోనే పోలీసుల రికార్డుల ప్రకారం 450 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 11 ఏండ్ల కిందట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ముఠాల కారణంగానే కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డబుల్ మర్డర్ కూడా అదే స్థాయిలో కత్తులతో వీరంగం సృష్టించడంతో సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ రౌడీ షీటర్లను టైట్ చేయాలని పోలీసు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీలో తిరిగి ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed