- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు దారి సిద్ధం చేసుకుంటున్న గండ్ర..
దిశ ప్రతినిధి, వరంగల్ : భూపాలపల్లి సీనియర్ రాజకీయ నేత, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరేందుకు మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గతంలోనే డిసైడయినా పూర్తి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వ్యూహాత్మకతతో కదులుతున్నారు. పార్టీలో చేరికకు ముందే రాజకీయ చికాకులను తొలగించుకునేందుకు రాజీ మంత్రాన్ని, విన్ విన్ ఫార్ములాను అనుసరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. తన చేరికపై కినుక వహించిన కాంగ్రెస్‌లోని కొంతమంది అసంతృప్తి నేతలతో రాజీ కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో గండ్ర సత్యనారాయణ భేటీ కావడం భూపాలపల్లి జిల్లా రాజకీయాల్లోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలోనూ ప్రాధాన్యం చోటు చేసుకుంది.
మీ సహకారం కావాలి…
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును గండ్ర సత్యనారాయణ ఆదివారం మంథని పట్టణంలోని ఓ గణేష్ ఉత్సవ మండపం వద్ద కలుసుకున్నారు. ఇద్దరి మధ్య అనేక రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినా.. గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌లో నిలదొక్కుకోవడానికి మీ సహకారం కావాలంటూ సత్యనారాయణ కోరడంతో, శ్రీధర్‌బాబు సైతం సానుకూలంగా స్పందించడం తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యమంటూ కుండబద్దలు కొట్టినట్లుగా తెలిసింది.
భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక మండలాల్లో శ్రీధర్‌బాబుకు సైతం మంచి క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. గండ్ర సత్యనారాయణ పార్టీలోకి వస్తే రాజకీయ వైరం తప్పదన్న చర్చ పార్టీలోనూ నడిచింది. అయితే తాజా రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఐక్యత రాగం వైపు వెళ్తుండటం శుభ పరిణామమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
రేవంత్‌ను భూపాలపల్లికి తీసుకొచ్చేందుకు యత్నాలు
కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఇప్పటికే స్వయంగా ప్రకటించిన గండ్ర సత్యనారాయణ త్వరలోనే భారీ సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులతో కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేవంత్‌రెడ్డిని భూపాలపల్లికి తీసుకురావాలని, పట్టణంలో సభ పెట్టించి అక్కడే కండువా కప్పుకోవాలని పట్టుదలతో ఉన్నట్లుగా ఆయన అనుచరుల ద్వారా అంటున్నారు. లేదంటే వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆ సభలోనైనా చేరిక ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సత్తెన్నకు జనంలో ఉన్న ఆదరాభిమానాలకు, కాంగ్రెస్ పార్టీ బలం తోడయితే గెలుపు తథ్యమని ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు.