'రాజీనామా చేస్తేనే అభివృద్ధి అనేది అబద్ధం'

by Ramesh Goud |
రాజీనామా చేస్తేనే అభివృద్ధి అనేది అబద్ధం
X

దిశ, భూపాలపల్లి: అభివృద్ధి అనేది రాష్ట్రంలో జరిగే నిరంతర ప్రక్రియ అని, సంక్షేమ పథకాలు అనేది పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు అని, శాసన సభ్యులు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది అవాస్తవం అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొంతమంది అవివేకంతో ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని, ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

ఆ కార్యక్రమం రూ.250 కోట్లతో హుజరాబాద్ లో ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని బంద్ చేయలేదనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని ఆయన సూచించారు. ఇది ఎన్నికల స్టంట్‌గా అనుకోవడం వారి అవివేకమన్నారు. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో అమలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి అందుతున్నాయనే విషయం మరిచిపోరాదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపణ చేశారు. రైతాంగం సంక్షేమం కోసం రూ.50 వేల వరకు రుణమాఫీ చేయాలని ఆదివారం జరిగిన కేబినెట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed