వరికొలు భూములపై పెదవి విప్పని గండ్ర

by Ramesh Goud |   ( Updated:2021-08-05 09:12:36.0  )
వరికొలు భూములపై పెదవి విప్పని గండ్ర
X

దిశ, భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల మండలంలో వరికోల్ గ్రామంలో మూడు వందల రైతులకు జరిగిన అన్యాయంపై ఇంతవరకు స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి పెదవి విప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గత 70 సంవత్సరాలుగా వరికోల్ గ్రామంలోని పదహారు వందల ఎకరాల భూమిని 300కు పైగా రైతులు సాగు చేస్తున్నారు. ఇట్టి భూమిలో అధికార పార్టీకి చెందిన నాయకులు కొంతమంది పట్టాలు పొంది భూమి తమదేనంటూ రైతులు సాగు చేసుకుంటున్న భూమి పైకి వెళ్లి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక రైతులు జిల్లా కలెక్టర్ వద్దకు ఫిర్యాదు చేయడంతో భూముల సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో పట్టాలు పొంది ఉన్న రైతులకు రైతుబంధు తోపాటు బ్యాంకులు రుణాలు రావడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేటు ముట్టడిచేశారు.

కలెక్టర్ మాత్రం రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై స్థానిక నాయకులు గండ్ర సత్యనారాయణరావు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. స్థానిక శాసన సభ్యులు మాత్రము ఈ విషయంపై ఇంతవరకు పెదవి విప్పలేదు. రైతులకు న్యాయం చేయాలని చేస్తానని హామీ ఇవ్వలేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో రైతుల పక్షాన మాట్లాడిన సందర్భం లేదు. దీంతో అక్కడి రైతులు శాసనసభ్యులు వ్యవహారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుచరుల కోసం గ్రామంలోని అందరికీ అన్యాయం చేసే విధంగా ప్రవర్తించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులకు తన కోటరీ తప్ప ప్రజల పక్షాన నిలబడకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది.

రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు

జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడంతో అధికారులు సగం మంది రైతుల భూములను బ్లాక్ లిస్టు నుండి తొలగించినట్లు తెలిసింది. కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్య యత్నం చేయడం తో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి రైతులకు ఉన్న ఆధారాల మేరకు బ్లాక్ లిస్టు తొలగించి రైతులకు ధరణిలో భూముల వివరాలు ఉండేలా తగు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన భూమిని సైతం ధరణిలో ఉండేవిధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed