ఆ గ్రామపంచాయతీలో వింత పోకడ.. బినామీ వర్కర్ల పేరుతో నిధులు స్వాహా

by Shyam |   ( Updated:2023-04-13 17:21:02.0  )
ఆ గ్రామపంచాయతీలో వింత పోకడ..  బినామీ వర్కర్ల పేరుతో నిధులు స్వాహా
X

దిశ, పరకాల: ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రగతి మార్గం వైపు నడిపించడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పల్లె ప్రగతి పేరుతో గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో నీరుగారి పోతుంది. అధికారులు కార్యాలయాల‌కే పరిమితం కావడంతో పర్యవేక్షణ లోపించి గ్రామపంచాయతీ పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయి. అడిగే నాధుడు లేక పోవడంతో గ్రామపంచాయతీ‌లో అవినీతి సైతం చోటు చేసుకుంటున్నట్లు పలు ఘటనలు తెలుపుతున్నాయి. అందులో భాగంగానే గత నెలలో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో 14 ఫైనాన్స్ నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు అంచనాకు రావడం గ్రామపంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అదే క్రమంలో మండలంలోని మరో గ్రామ పంచాయతీలో సైతం అవినీతి జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దిశ పత్రిక విలేఖరి హౌస్ బుజుర్గ్ గ్రామాన్ని సందర్శించగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్స్ గా ముగ్గురిని నియమించుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి తెలియజేశారు. కానీ విధులు మాత్రం ఒక్కరే నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు. జీతాలు మాత్రం ఎలాంటి విధులు నిర్వహించకుండానే చెల్లిస్తున్నామని స్వయాన పంచాయతీ కార్యదర్శి తెలియజేయడం గమనార్హం. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీలో బహుళ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పంచాయతీ ట్రాక్టర్ ను గ్రామపంచాయతీ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ పక్కనపెట్టి వేరే ట్రాక్టర్ను గ్రామంలో ఉపయోగిస్తూ అందులోనే డీజిల్ పోయించి ఆ ట్రాక్టర్ ను పొద్దంతా ప్రైవేట్ అవసరాలకి వినియోగిస్తున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ను సైతం నిత్యం వాడకుండా ఎప్పుడోసారి ఉపయోగిస్తూ నిత్యం పారిశుద్ధ్య అవసరాలకే ఉపయోగిస్తున్నట్లు డిజిల్ లెక్కలు రాస్తున్నారని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ లో ఉండాల్సిన ట్రాక్టర్ను తన ఇంటివద్దే ఉంచుకోవడం వెనకాల మతలాబు ఏంటనేది గ్రామంలోని కొందరి వాదన. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తో పాటు అనేక సమస్యలు అపరిస్తృతంగా మిగిలిపోతున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed