VIRAL : టూరిస్టుగా వచ్చి బిహారీ ఇంటి కోడలైన ఫ్రెంచ్ మహిళ.. ఆమెను చూసేందుకు ఊరే కదిలిందట..!

by Anukaran |
VIRAL : టూరిస్టుగా వచ్చి బిహారీ ఇంటి కోడలైన ఫ్రెంచ్ మహిళ.. ఆమెను చూసేందుకు ఊరే కదిలిందట..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ సరిహద్దులను సైతం చెరిపివేస్తుంది. ప్రేమకు కులం, మతం, జాతి, రంగు ఇవేవి అవసరం లేదు. రెండు మనసులు ఒక్కటైతే చాలు. తమ ఇష్టమైన వ్యక్తిని కలుసుకోవడానికి ఖండాంతరాలైన దాటే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇవన్నీ కేవలం సినిమాల్లోనే జరుగుతాయని అనుకునేవారు లేకపోలేదు. అయితే, ఈ మధ్యకాలంలో ప్రేమ నిజంగానే ఎల్లలు దాటుతోంది. చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడి అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఎంతో మంది విదేశీ అమ్మాయిలు కూడా ఇక్కడి అబ్బాయిలను ప్రేమించి, భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా ఇండియా చూసేందుకు వచ్చిన ఓ ఫ్రెంచ్ మహిళ ఓ బిహారీ వ్యక్తిని ప్రేమించి.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ జంటను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు చేరుకోవడంతో వీరి పెళ్లి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

వివరాల్లోకివెళితే.. పారిస్‌లో వ్యాపారవేత్త అయిన ‘మేరీ లోరీ హెరాల్’ ఆరేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి బిహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లోని కఠారియా గ్రామానికి చెందిన టూర్ గైడ్ రాకేష్‌తో ప్రేమలో పడింది. ఢిల్లీలో స్థిరపడిన రాకేష్.. మేరీకి పర్యాటక ప్రాంతాలు చూపించడంలో ఎంతో సాయం చేశాడు. అలా వీరిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది. తిరిగి పారిస్ వెళ్లాక కూడా మేరీ ఇతనితో టచ్‌లో ఉంది. అలా మూడేళ్ల గడిచాక ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత రాకేష్ తనతో వచ్చి బట్టల వ్యాపారం చూసుకోవాలని మేరీ కోరడంతో అందుకు ఓకే చెప్పాడు. దీంతో ఫ్రెంచ్ లేడి రాకేష్‌తో పెళ్లికి తన ఇంట్లో వారిని ఒప్పించింది.

అయితే, ఇండియన్ ట్రెడిషన్ మేరీని ఎంతగానో ఆకట్టుకుందని రాకేష్ తండ్రి రామచంద్ర షా తెలిపారు. దీంతో మేరీ, రాకేష్‌లు ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ నుంచి వచ్చిన మేరీ కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.హిందూ ఆచారమైన ‘జయమాల’కు ముందు ఇరు కుటుంబాలు ఒక్కటయ్యాయని, వివాహ వేడుక తర్వాత హిందీ, భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేసినట్టు రాకేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేడుకకు బీహార్ సంస్కృతిని ఇష్టపడే విదేశీ అతిథులు కూడా హాజరయ్యారని సమాచారం. పారిస్‌లో పెద్ద వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన మేరీ ‘బెగుసరాయ్’ వంటి చిన్న పట్టణంలో వివాహం చేసుకోవాలనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాకేష్ మీద ఉన్న ప్రేమ కారణంగానే మేరీ ఇంత చిన్న ప్రాంతంలో పెళ్లికి ఓకే చెప్పి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు. వారం తర్వాత ఈ జంట తిరిగి పారిస్ వెళ్లిపోనుండగా.. తమ గ్రామంలో వర్ణాంతర వివాహం జరిగిందని తెలిసి ఫ్రెంచ్ వధువును చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

Advertisement

Next Story

Most Viewed