ఆ అడుగుకి నేటితో నాలుగేళ్లు.. జనం మనిషిగా మారిన జగన్‌

by Anukaran |
ఆ అడుగుకి నేటితో నాలుగేళ్లు.. జనం మనిషిగా మారిన జగన్‌
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి శనివారానికి నాలుగేళ్లు పూర్తి అయింది. 2017 నవంబర్‌ 6.. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ సాక్షిగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా ఇవ్వాలనే ప్రజా సంకల్పంతో ఈ యాత్రను ఆరంభించారు. ప్రజల చెంతకే నడుచుకుంటూ వెళ్లాడు. భరోసాగా ప్రజల కోసం నడిచాడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళుతూ.. ప్రజా సంకల్పమంటూ ముందుకు సాగారు. ఒక్క కిలోమీటర్ కాదు.. రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాడు.

మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో 2,516 గ్రామాల్లో 124 బహిరంగ సభలతో 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. ఇలా 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో జ‌న‌వ‌రి 9, 2019న ముగిసింది. ప్రజల సమస్యలను వింటూ.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ వైఎస్ జగన్‌ జనం మనిషిగా మారిపోయాడు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున నిలబడ్డారు. వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. కన్నీళ్లు తుడిచారు. ధైర్యం నూరిపోశారు. మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.

నాడు ప్రజా ప్రస్థానంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో మరుపురాని నేతగా నిలిచిపోయారు. ఆ తర్వాత మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్‌ షర్మిల సైతం ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకు నడిచారు. ఈ పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువైన కుటుంబంగా వైఎస్ఆర్ కుటుంబం చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు ప్రజలు సైతం ఈ కుటుంబానికి హారతులు పట్టారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్, షర్మిల అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు.

జగన్ రాజకీయ జీవితాన్ని మార్చేసిన యాత్ర..

ప్రజా ప్రస్థానం పాదయాత్ర దివంగత వైయస్‌ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్ సైతం నడిచారు. పాదయాత్ర ద్వారా ప్రతీ కుటుంబానికి చేరువయ్యాడు. గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని.. తాను చేపట్టబోయే పథకాలను చేరవేశాడు. అంతేకాదు నేను ఉన్నానంటూ పదేపదే భరోసానిచ్చారు. ఎండనకా.. వాననకా.. చలిని సైతం లెక్కచేయకుండా అలుపెరగని యాత్ర చేసిన వైఎస్ జగన్‌కు 2019 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏకంగా 151 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెపలాడింది. అఖండ మెజారిటీతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమ‌లు చేశారు. ఏడాదిన్నర పాల‌న‌లో దాదాపు 95 శాతం హామీలు అమ‌లు చేసి దేశానికే దిక్సూచిలా వైయస్‌ జగన్‌ నిలిచారు.

నేటి కార్యక్రమాలు..

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 06-11-2021తో నాలుగేళ్ళు పూర్తయింది. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలచుకొని అధికారం చేపట్టిన తర్వాత అందులో 97 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. ఈ సందర్భంగా నాటి పాదయాత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. శనివారం ఉదయం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించాలని ఆదేశించింది. అలాగే సర్వమత ప్రార్ధనలు.. కేక్ కటింగ్.. సంఘీభావంగా పాదయాత్రలు చేపట్టాలని పార్టీ సూచించింది.

Next Story

Most Viewed