రూ.500కోట్ల స్కామ్‌పై చర్యలు తీసుకోవాలి: పద్మనాభరెడ్డి

by Shyam |
రూ.500కోట్ల స్కామ్‌పై చర్యలు తీసుకోవాలి: పద్మనాభరెడ్డి
X

దిశ, క్రైమ్ బ్యూరో: వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు కుమ్మక్కై రూ.500కోట్లను గుత్తేదార్లకు వాపసు చేసిన స్కామ్‌లో పదేళ్లు గడిచినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గవర్నర్ తమిళిసై సౌదర్ రాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంపై వెంటనే చర్యలకు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ జలయజ్ఞం పనులలో భాగంగా గుత్తేదారులు 4శాతం వ్యాట్‌ను ప్రభుత్వానికి జమ చేశారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని మరో కేసులో కాంట్రాక్టర్‌కు వ్యాట్ తిరిగి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందన్నారు.

అయితే, ఈ కేసును సాకుగా తీసుకున్న అధికారులు జలయజ్ఞం పనులకు సంబంధించిన గుత్తేదారులకు కూడా అడుగకుండానే 2009, 2010, 2011 సంవత్సరాలలో సుమారు రూ.500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విచారణ చేసి రెవెన్యూ శాఖకు అందజేశారన్నారు. డీజీ నివేదికలో రూ.500కోట్ల కుంభకోణం జరిగిందని, బాధ్యులయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా సంజాయిషీ అడగడంతో వారు వెంటనే ట్రిబ్యునల్ ను ఆశ్రయించారని, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళడంతో గత నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు లేకుండా ఉంటున్నట్టు పద్మనాభ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed