- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హస్తానికి దూరం.. కమలానికి దగ్గర.. ఎవరా నేత?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ పార్లమెంటు సభ్యుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టు ఉన్న నేత రాథోడ్ రమేష్ కాంగ్రెస్ పార్టీకి దూరం కాబోతున్నారా? అంటే జిల్లా రాజకీయ వర్గాల్లో అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గిరిజన నేత రాథోడ్‌కు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
నార్నూర్ జడ్పీటీసీ సభ్యునిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాథోడ్ 1999లో తొలిసారిగా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి జడ్పీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2008 ఖానాపూర్ ఉప ఎన్నికల్లో తన భార్య సుమన్ రాథోడ్‌పే బరిలోకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా ఆయన విజయం సాధించారు. ఆ కాలంలోనే ఆయన బలమైన నేతగా ఎదిగారు. ఇక 2014లో టీడీపీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్‌ను సాధించారు.
ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలతో మాత్రం టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ పార్టీ అంతంతమాత్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. తీయస్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కారణంగా బీజేపీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు రాథోడ్ సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మేరకు గత వారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలంలోని ఒక ఆలయంలో తన సన్నిహితులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన కాలంలో ఆయనకు ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సంబంధాలు ఉండడం, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పరిచయాలు ఉండడం ఈ సందర్భంగా బీజేపీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు, రాథోడ్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపీ బాపురావును కాదని..!
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యుని హోదాలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయన ఆదిమ గిరిజన తెగలకు చెందిన నేతగా పేరు ఉంది. తాజాగా లంబాడ జాతికి చెందిన రాథోడ్ బీజేపీలో చేర్చుకునే విషయంలో పెద్ద చర్చే జరుగుతున్నది. సోయం బాపూరావును కాదని రాథోడ్‌ను పార్టీలోకి తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. అయితే భవిష్యత్తులో బీజేపీ బలోపేతం దృష్ట్యా బాపూరావును ఒప్పించి రాథోడ్‌ను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ వారం రోజుల్లోనే దీనిపై ఒక క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.