కరోనాతో మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

by  |
కరోనాతో మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. కరోనా వైరస్‌తో గతనెల రోజులుగా బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1961లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించిన మాణిక్యాలరావు.. 2014లో తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2018 ఆగస్టు వరకు చంద్రబాబు హయాంలో ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.

చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులైన మాణిక్యాలరావు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ నిర్థారణ అయిన తర్వాత ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. కార్యకర్తలు ఎవ్వరూ బాధపడొద్దని చెప్పి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాణిక్యాలరావు కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు.

మాణిక్యాలరావు చనిపోయారన్న వార్తను బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. కార్యకర్తలను పేరుపెట్టి పిలుస్తూ అందరితో కలివిడిగా ఉండే ఆయన మరణవార్త విని పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పార్టీ ఎదుగుదలకు జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కృషి చేశారని కన్నిటీ పర్యంతం అవుతున్నారు. అటు తాడేపల్లిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నేతలు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.


Next Story

Most Viewed