ఖానా… ఠికానా.. దవాఖానాలోనే..

by Shyam |
ఖానా… ఠికానా..  దవాఖానాలోనే..
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పాజిటివ్ పేషెంట్లకు, ఐసొలేషన్ వార్డుల్లోని పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఇకపైన ఆసుపత్రి ఆవరణలోనే వసతి సౌకర్యం కల్పించాలనుకుంటోంది ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న గాంధీ, ఫీవర్, ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రి, గచ్చిబౌలి స్టేడియం తదితర చోట్ల ఇలాంటి సౌకర్యం కల్పించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ సోకుతున్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటివారు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి షిప్టులవారీ డ్యూటీ వేసే ప్రణాళిక సిద్ధమైంది. ఐదు రోజులపాటు డ్యూటీలో ఉండే వీరు ఇళ్ళకు వెళ్ళకుండా ఆసుపత్రి ఆవరణలోనే ఏర్పాటుచేసిన ఇండ్లలో ఉండిపోతారు. ఐదు రోజుల షిప్టు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళి విధిగా క్వారంటైన్‌లో ఉంటారు.

క్వారంటైన్‌లో ఉన్న సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని టాస్క్ ఫోర్స్ సభ్యులు పర్యవేక్షిస్తూ ఉంటారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది ద్వారా కుటుంబ సభ్యులకు అంటుకోకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది వైద్యారోగ్య శాఖ. ఒక్కో షిప్టులో ఎంతమంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆయాలు, పారా మెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉంటారో దానికి అనుగుణంగా క్వార్టర్లను సిద్ధం చేసే పని జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ ఆసుపత్రి ఆవరణలో ఇండ్లు లేనట్లయితే సమీపంలో ఒక అపార్టుమెంటు లేదా ఇతర ఇండ్లను ఎంపిక చేయనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రి నుంచి క్వార్టర్ వరకు వెళ్ళడానికి రానుపోను రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. క్వార్టర్ల దగ్గర కూడా పోలీసు భద్రతతో పాటు శానిటైజేషన్ ఏర్పాట్లు ఉంటాయి.

ఐదు రోజుల షిప్టు ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిన తర్వాత ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఆ తర్వాతి రోజు నుంచి మళ్ళీ విధులకు వచ్చి ఐదు రోజుల పాటు డ్యూటీలో ఉంటూ క్వార్టర్లలోనే ఉండిపోవాలి. అయితే ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న తర్వాత డ్యూటీకి రాలేని పక్షంలో అందుకు తగిన కారణాలను ఉన్నతాధికారులకు వివరించాలి. గైర్హాజరైనట్లయితే ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న ఐదు రోజులూ సెలవులుగా పరిగణించాల్సి ఉంటుందని, అవసరమైతే వేతనాన్ని కూడా కోత పెట్టక తప్పదని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. క్వారంటైన్‌లో ఉన్న ఐదు రోజుల్లో డాక్టర్లు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలి తప్ప స్వంత క్లినిక్‌లు లేదా ఇతర ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ లేదా విజిటింగ్‌కు వెళ్ళరాదని స్పష్టం చేసింది. కరోనా పేషెంట్లు, ఐసొలేషన్ వార్డుల్లో పనిచేసే మొత్తం వైద్య సిబ్బందిలోని మూడవ వంతు మంది ఎప్పుడూ ఇండ్లలో క్వారంటైన్‌లోనే ఉంటారని వివరించింది.

వైద్య సిబ్బందికి కరోనా ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని, వారి ద్వారా కుటుంబ సభ్యులకు లేదా చుట్టుపక్కలవారికి అంటుకోకుండా (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ఉండేందుకు ఈ విధానాన్ని అవంబించాల్సి వస్తోందని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. ఐదు రోజుల డ్యూటీ ముగించుకున్న తర్వాత ఇండ్లలో క్వారంటైన్‌కు వెళ్ళేముందు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారని, ఒకవేళ ఏవేని అనారోగ్య లక్షణాలు లేదా అనుమానితమైన లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని ఇండ్లకు పంపబోమని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్, పారిశుద్య సిబ్బంది తదితరుల సంఖ్యకు అనుగుణంగా షిప్టుల జాబితా తయారవుతుందని వివరించారు.

Tags : Telangana, corona, medical team, doctors, nurses, Accommodation, home quarantine

Advertisement

Next Story