జానపదాల జాతర.. యూట్యూబ్‌, వెండితెరపై ఫోక్ సాంగ్స్ హవా

by Shyam |
folksongs
X

దిశ, ఫీచర్స్ : మాగాణి ఊగితే పాట.. నేలమ్మ ఈనితే పాట. మబ్బులు కరుణిస్తే పాట.. అగ్గిరాజుకుంటే పాట. అంతేనా చీకట్లు ముసురుకున్నా, జిలుగులు పరుచుకున్నా.. రాగం ఎత్తాల్సిందే. కునుకు రావాలన్నా, మత్తు వదలాలన్నా.. గొంతు సవరించాల్సిందే. ఇలా శ్రమైక జీవనంలో పురుడుపోసుకున్న పాట.. మట్టి పరిమళాలను గుభాళిస్తూ, చెమటచుక్కల బరువును మోస్తుంది. అందుకే మన జీవం, జీవనం.. సర్వం స్వరమయం, సంగీతప్రియం. ప్రకృతిలోని అడుగడుగూ, జీవరాశిలోని అణువణువూ ‘సరిగమల’ సంగమమే కాగా.. ఏ భావం స్ఫురించినా, ఏ భావోద్వేగం ఉప్పొంగిన స్వరరాగ గంగా ప్రవాహమై మనల్ని మీటుతుంది. ఇలాంటి జనం పాటకు పట్టం కట్టేవి యాస, భాషలే అయినా.. ప్రాంతంతో సంబంధం లేకుండా ‘జాన పదాలు’ ఖండాంతర ఖ్యాతిని పొందుతున్నాయి. ఇప్పుడు వెండితెరపైనే కాదు, సోషల్ మీడియా వేదికల్లోనూ జనపదాల జాతరే నడుస్తోంది. ఇటీవలి కాలంలో ‘ఫోక్ సాంగ్స్’‌కు పెరిగిన జనాదరణే అందుకు నిదర్శనం.

తెలంగాణ ప్రజల గుండెచప్పుడై మోగిన పాట.. ఉత్తరాంధ్ర పల్లె బతుకై వినిపించింది. యావత్ తెలుగు ప్రజల జీవన వేదం జానపద పాటల్లోనే కనిపిస్తుంది. నిన్నమొన్నటి వరకు చేనుచెలకలే పరిమితమైన ఆ మట్టి పదాలు.. ప్రస్తుతం వెండితెరపై, సోషల్ మీడియా వేదికగా ‘నీరాజనాలు’ అందుకుంటున్నాయి. ప్రస్తుతం అగ్రహీరోల చిత్రాల్లోనూ జానపదం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటోంది. ఈ క్రమంలో వచ్చిన ‘సారంగదరియా’ పాటకు విదేశీయులు సైతం పాదం కలపగా.. తాజా సంచలనం ‘బుల్లెట్ బండి’ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. రాక్, పాప్, జాజ్ వంటి అల్ట్రా మోడర్న్ మ్యూజిక్ ఎరాలో.. జానపదాలకు, జనసాహిత్యాన్ని ప్రజలు ఆదరించడం శుభపరిణామం. ముఖ్యంగా ‘ఫోక్’ వాయిస్‌ను బలంగా వినిపించడంలో సోషల్ మీడియాది కీ రోల్. పల్లె పాటలను యూట్యూబ్‌ ప్లాట్‌ఫ్లామ్‌పై సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కళాకారులు.. ఈ తరం నెటిజన్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలో విదేశీ, దేశీ జానపదాలు కూడా ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్నాయి. అందులో కొన్ని..

బెల్లా సియావో మ్యానియా :

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘మనీ హీస్ట్’ వరల్డ్ వైడ్‌‌గా ఎంతటి ఆదరణ దక్కించుకుందో.. అందులోని ‘బెల్లా సియావో’ సాంగ్‌ కూడా అదే స్థాయి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇది ఒక ఇటాలియన్‌ జానపద గేయం కాగా.. బెల్లా సియావో అంటే ‘అందమైన అమ్మాయికి వీడ్కోలు’ అని అర్థం. ఉత్తర ఇటలీలోని వరి పొలాల్లో ఉండే కఠినమైన పని పరిస్థితులకు నిరసనగా మొండినా కార్మికులు(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) మొదటిసారి ఈ గీతాన్ని పాడారు. తమ కష్టాలను గుర్తించాలని భూస్వాములకు ఈ పాట ద్వారా తెలియజేశారు. ఇక 1943 -1945 మధ్యకాలంలో ఇటలీని ఆక్రమించిన నాజీ జర్మన్ దళాలకు వ్యతిరేకంగా, ఇటాలియన్ ప్రతిఘటన సమయంలో ఫాసిస్ట్‌కు వ్యతిరేకంగానూ ఈ గీతాన్ని సవరించి తమ గొంతు వినిపించారు. ఆ తర్వాత వరల్డ్‌ కల్చర్‌లో ఓ భాగమైన ఈ పాట.. ఎన్నో భాషల్లోకి అనువదించబడి ప్రస్తుతం ‘మనీ హీస్ట్’ సిరీస్‌ ప్రభంజనంతో యావత్ ప్రపంచాన్ని ఊపేసింది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బిజినెస్‌‌మెన్‌’ చిత్రంలోని ‘పిల్లా.. చావ్’ అనే పాటను కూడా ‘బెల్లా సియావో’ స్ఫూర్తితో రూపొందించడం విశేషం. ఈ క్రమంలో అనేక భారతీయ భాషల్లోనూ కంపోజ్ చేయబడింది. ప్రస్తుతం దేశీ హార్మోనియం, తబలా, మంజీరాపై గుజరాతీ యాసలో ఆలపించిన ఈ సాంగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది.

రాజస్థానీ జానపదానికి ర్యాప్ టచ్ :

పంజాబీ లేదా హర్యానీ కళాకారులు తమ పాటకు ర్యాప్‌ను జోడించడం లేదా పూర్తిగా ర్యాప్‌ స్టైల్‌లో సాంగ్ కంపోజ్ చేయడం చూస్తుంటాం. ఇలా ప్రాంతీయ సంగీతానికి ర్యాప్ శైలిని మిక్స్ చేయడంలో ‘సుమ్సా సుపారీ, రోవెల్ స్టార్’ పాపులర్. ఈ ఇద్దరు రాజస్థానీ గాయకులు జానపద సంగీతానికి అర్బన్ టచ్ జోడించి సంగీతాభిమానుల ప్రేమను పొందుతున్నారు. నేటి యువ తరం కొత్తరకం సంగీతాన్ని వినేందుకు ఇష్టపడుతున్నందున.. పంజాబీ, హర్యానీ స్టైల్‌లో రాజస్థానీ సంగీతానికి ర్యాప్ యాడ్ చేశామని చెబుతున్నారు. ‘రాజస్థానీ సంగీతాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా మంటున్న ఈ ర్యాప్ సింగర్స్.. ప్రపంచవ్యాప్త వేదికపై తగినంత గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెబుతున్నారు.

సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రాచీన సంగీత వారసత్వాన్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత. జానపద సంగీతానికి ప్రత్యేక అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జానపదాలు చరిత్రలో మానవ జీవన విధానాన్ని, నాగరికతను నిర్వచించాయి. వాటికి ప్రాణం పోయాలి.

– బషీర్ ఖాన్, జానపద కళాకారుడు

జానపద సంగీతం.. వ్యక్తుల భావోద్వేగాలు, ప్రదేశాలు, జీవితానికి సంబంధించినది. ఇవి ఒకరి జీవిత ప్రయాణాన్ని లేదా ఓ భావోద్వేగం తాలుకా స్టోరీని వివరిస్తాయి. వారి మూలాలను స్పృశించి, అంతర్గత స్పృహకు తిరిగివెళ్లే రూపకం ద్వారా మాట్లాడతాయి. జానపదాన్ని పునరుజ్జీవంపజేసే ప్రయత్నంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

– అంతర్‌మాన్‌, ఫోక్ బ్యాండ్

పాశ్చాత్య దేశాల సంగీత శైలిని అరువు తెచ్చుకునే క్రమంలోనే హిప్ హాప్, ర్యాప్, జాజ్ ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందాయి. నా చిత్రాల్లోనూ ఈ స్టైల్ ఉపయోగించాను. కానీ మన జానపద శక్తినే దేశం ఉపయోగించకోవడం లేదు. మార్పు కోసం మన సొంత సంగీతాన్ని అన్వేషించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం ‘స్కోడా సోనిక్ రూట్స్’ అనే ఓ కొత్త షో కోసం గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ప్రతిభావంతులైన ప్రముఖ జానపద గాయకులతో దేశమంతటా పర్యటించాను. ప్రతి ప్రదేశానికి చెందిన స్థానిక సంప్రదాయాలు, కథలను ఈ మ్యూజిక్ వీడియోలో షూట్ చేశాం. వ్యక్తిగతంగా జానపద సంగీతాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఈ జర్నీలో మాత్రం జానపద సంగీతంలో మునిగిపోయాను. ఇక మా కుటుంబంలోనూ ఫోక్ సాంగ్స్ భాగమే. ఓ గుజరాతీగా నేను కూడా ‘గర్భ, డేరో లోక్ గీత్’ వింటూనే పెరిగాను.

– అమిత్ త్రివేది, సంగీత దర్శకుడు

‘తెర నిండుగా’ పల్లె పాటలు

* నాది నక్కిలీసు గొలుసు

* రాములో రాములా

* దిగుదిగు దిగునాగ

* సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు

* ఆ గట్టునుంటావా..

* దారిచూడు దుమ్ముచూడు

నెటిజన్ల గుండెనిండుగా

* బుల్లెట్టు బండి

* తిన్నతిరం పడుతలే

* ధన్ ధనాధన

* గుట్టగుట్ట తిరిగేటోడా

* చిటపట సినుకులకి

* ఆడనెమలి

టిక్‌టాక్, ఇన్‌‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు ఈ పాటలను విశ్వవ్యాప్తం చేయడంతో తెరనిండుగా జానపదాల జాతర మొదలైంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా? జానపదం జనం నోళ్లలో ఆడుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం జానపద వారసత్వాన్ని కొనసాగించేందుకు, ఆ ప్రాచీన పదజాలాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రత్యేక అకాడమీలు ఉండాలని ఎప్పటి నుంచో సంగీతాభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story