ఎమ్మెల్సీలుగా.. పాతవారికే అవకాశమా?

by Shyam |   ( Updated:2021-05-09 11:49:19.0  )
ఎమ్మెల్సీలుగా.. పాతవారికే అవకాశమా?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా అన్ని రకాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాల వైపు సారిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల విభాగంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, నగర్ కర్నూల్‌కి చెందిన కుచుకుల్లా దామోదర్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం ఏడాది చివర్లో ముగియనుండడంతో.. ఆశావాహులు ఆ స్థానాల నుండి పోటీ చేసేందుకు ఇప్పటి నుండే దృష్టిసారిస్తున్నారు. మరోవైపు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే తమకు పోటీ చేసే అవకాశం ఎక్కడ దక్కుతుందని సంక్షేప పడుతున్నారు. అయినప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం తెరపైకి వస్తోంది.

ఒకే జిల్లా.. ఒకే సామాజిక వర్గం

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాతిపాదికన ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో జరిగాయి. అప్పట్లో కులాల ప్రాతిపదికగానే, జిల్లాల ప్రాతిపదికగానే తెరపైకి రాలేదు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోవడం, ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వారే కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి ఎన్నికలలో ఇద్దరిలో ఎవరైనా ఒకరికి అవకాశం ఉంటుందని, మరో స్థానాన్ని ఇతర జిల్లాలకు, వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం లభించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల్లా దామోదర్ రెడ్డి తిరిగి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వారి అనుచరులు చెప్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ పోటీచేసే అవకాశం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో తిరిగి ఎమ్మెల్సీలుగానే కొనసాగాలన్న ఆలోచనలు చేసినట్లు సమాచారం.. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఇరువురు నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ కుచుకుల్లా దామోదర్ రెడ్డి పరిస్థితులను బట్టి తన కుమారుడికి పోటీ చేయించేందుకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.

ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆశావాహులు

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు రెండు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో.. ఈసారి ఒక స్థానం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో వారికి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఒక స్థానం ఉండడంతో మహబూబ్‌నగర్ పార్లమెంటులో నుండి బీసీలకు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు బీసీ నాయకులు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్న పలువురు ముఖ్య నాయకులతో పాటు ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

పోటీ చేస్తే చాలు.. విజయమే

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. గెలుపు నల్లేరు మీద నడకగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి చెందిన వారే 80 శాతంపైగా విజయం సాధించి పదవులలో కొనసాగుతున్నారు. ఈ కారణంగా ఎలాగైనా పోటీ చేసేందుకు అవకాశం కలిగేలా మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed