- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాగ్రత్త… మీపై కేంద్రం ఫోకస్ చేస్తోంది
దిశ, న్యూస్ బ్యూరో: గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై కేంద్రం కన్నేసింది. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నా గ్రామాల్లో సమగ్ర పాలన సాగడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల వినియోగంపై ఆడిట్ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామంటూ ఆంక్షలు విధించింది. దీంతో పంచాయతీల్లో ఆడిట్ అనివార్యమైంది. ఇప్పటికే నిధుల వినియోగంలో పంచాయతీల్లో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిగా పెంచకున్నా… పంచాయతీల్లో పని చేసే కార్మికుల వేతనాలు పెంచడం, విద్యుత్ బిల్లులు ఇక నుంచి ప్రతినెలా చెల్లించాలని ఆదేశాలివ్వడం, ట్రాక్టర్ల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలతో నిధులన్నీ నీళ్లలా ఖర్చవుతున్నాయి. అయితే గతంలో పంచాయతీల్లో వినియోగించిన నిధులకు యూసీలు ( యుటిలైజేషన్ సర్టిఫికెట్స్) సమర్పిస్తే వాటినే పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేసేవారు. కానీ, ఇక నుంచి కేంద్రం ఆన్‌లైన్ ఆడిట్ తప్పనిసరి చేసింది. అంటే పంచాయతీల్లో వెచ్చించిన ప్రతి రూపాయికి ఎమ్మార్పీ ధరలను అనుసరిస్తూ వాటికి సంబంధించిన రశీదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్ ఆడిట్‌లో ధ్రువీకరించిన తర్వాతే వాటిని పరిగణలోకి తీసుకుంటారు.
నేటి నుంచి మొదలు..
పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ సోమవారం నుంచి మొదలుకానుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని స్పష్టం చేసింది. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్ ఆడిట్ తప్పనిసరిగా చేయడంతో ప్రతిపైసా లెక్కించాలని సూచించింది. రాష్ట్రంలోని 542 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయితీల్లో ముందుగా 3,830 (30 శాతం) గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ ప్రారంభమవుతోంది. పంచాయతీ కార్యదర్శులు, ఆడిటర్లకు సంయుక్తంగా పంచాయతీరాజ్, ఆడిట్ శాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆన్‌లైన్ ఆడిట్ ప్రక్రియపై కార్యదర్శులకు ఆన్‌లైన్ ఆడిట్ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని పంపించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి దేశ వ్యాప్తంగా కనీసం 20 శాతం గ్రామపంచాయతీల ఆడిట్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని, వాటి ప్రకారమే పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఆన్‌లైన్ ఆడిట్ కోసం 350 మంది అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 3,830 పంచాయతీల్లో 336 మంది ఆడిటర్లతో నేటి నుంచి ఆడిట్ ప్రారంభించి అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం, పన్నులు, చేసిన ఖర్చులన్నీ ఆన్‌లైన్ ఆడిట్‌లో స్పష్టం చేసిన తర్వాత వాటి ఆమోదం వస్తేనే కేంద్రం నిధులు రానున్నాయి.
నిధుల సంక్షోభం
మరోవైపు గ్రామ పంచాయతీల్లో నిధుల సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం వస్తున్న నిధులన్నీ పంచాయతీల నిర్వహణకే సరిపోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉండాలని, పారిశుధ్య కార్మికులకు వేతనాలు రూ. 8,500ల చొప్పున పెంచడం, మల్టీపర్పస్ కార్మికులుగా గుర్తించి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నిధులు వాటికే సరిపోతున్నాయి. దీంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొందామంటే కూడా చిల్లిగవ్వ ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చాలా పంచాయతీల్లో గ్రామానికి సంబంధించిన పనులేమీ జరుగడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ పాలకవర్గాలపై నింధలు తప్పడం లేదు. ఇదే సమయంలో ఆన్‌లైన్ ఆడిట్‌కు కేంద్రం ఆదేశాలివ్వడం, అవి పూర్తి చేసిన తర్వాతనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని తేల్చి చెప్పడంతో పంచాయతీల్లో మరింత ఆందోళన నెలకొంది.