రెట్టింపు ఆదాయాన్ని సాధించనున్న FMCG రంగం!

by Harish |
consumer goods sector
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ఉత్పత్తుల(ఎఫ్ఎంసీజీ) రంగంలో ఆదాయ వృద్ధి 10-12 శాతంతో రెట్టింపు స్థాయిలో నమోదవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 5-6 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది బలమైన వృద్ధి సాధించడం ద్వారా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే అత్యధికంగా నమోదవుతుందని నివేదిక అభిప్రాయపడింది. ముడిసరుకుల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ పలు ఉత్పత్తుల ధరలు కూడా పెంచడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ‘పలు సవాళ్ల మధ్య ముడిసరుకుల ఖర్చు పెరుగుదలను అధిగమించేందుకు గత ఆరు నెలల్లో తయారీ కంపెనీలు చాలావరకు ఉత్పత్తుల ధరలను 4-5 శాతం మధ్య పెంచాయి. అదే సమయంలో వాల్యూమ్ పరంగా కూడా డిమాండ్‌కు తగినట్టుగా ఉత్పత్తిని 5-6 శాతం పెంచాయి.

సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా గ్రామీణ మార్కెట్లో వృద్ధి మితంగా ఉన్నప్పటికీ, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్లో డిమాండ్ పుంజుకోవడం ద్వారా వృద్ధి భర్తీ కాగలదని’ క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి అన్నారు. అలాగే, నిర్వహణ ఖర్చులు ఈ ఏడాది 19-20 శాతానికి తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ అభిప్రాయపడింది. గతేడాది ఇది 10 శాతం అధికంగా ఉండేదని నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ రంగంలో సగానికి పైగా పట్టణ విభాగం నుంచి ఆదాయం లభిస్తుంది. దశల వారీగా కార్యకలాపాలు పునరుద్ధరణ కావడం, సరఫరా వ్యవస్థ పుంజుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సెకెండ్ వేవ్, వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల గ్రామీణ మార్కెట్లో వృద్ధి నెమ్మదించవచ్చని క్రిసిల్ వివరించింది. విభాగాల వారీగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార పదార్థాలు, డ్రింక్స్, ఇంటి అవసరాలకు వాడే విభాగాల్లో ఉత్పత్తులు అమ్మకాలు 8-10 శాతం పెరుగుతాయి. వ్యక్తిగత వినియోగ ఉత్పత్తుల విభాగంలో 11-13 శాతం పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed