నేడు 'గాంధీ'పై ఆర్మీ పూల వర్షం

by Shyam |   ( Updated:2020-05-02 12:22:16.0  )
నేడు గాంధీపై ఆర్మీ పూల వర్షం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసుల సేవలకు గుర్తుగా.. వారిని భారత రక్షణ శాఖ వినూత్న రీతిలో సన్మానించనుంది. కరోనా వైరస్‌కు యావత్ ప్రపంచమే భయపడుతుంటే వైద్య సిబ్బంది, పోలీసులు మాత్రం ప్రజల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని ప్రధాని మొదలు సీఎం వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అధ్యక్షతన జరిగిన త్రివిధ దళాధిపతుల సమావేశంలో కశ్మీరు నుంచి తిరువనంతపురం వరకు, అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్ల ద్వారా వైద్య సిబ్బందిపై పూలు చల్లి కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా నగరంలోని కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా ఉన్న గాంధీ దవాఖానాలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు జయశంకర్ విగ్రహం వద్ద హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురవనుంది. ఆ సమయానికి యూనిఫారం ధరించి డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది సహా మొత్తం వైద్య సిబ్బంది హాజరుకావాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ సర్క్యులర్ జారీ చేశారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ తరపున కెప్టెన్ కెఎస్.రాజు, గ్రూప్ కెప్టెన్ పంకజ్ గుప్తా నాయకత్వంలో గాంధీ వైద్యులు, నర్సులు, సిబ్బందికి గులాబీ పూలతో అభినందనలు తెలిపేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

Tags: Telangana, Gandhi Hospital, Corona, Health, Doctors

Advertisement

Next Story

Most Viewed