చేనేత కళాతృష్ణ.. ఐదుగురికి జాతీయ అవార్డులు

by Shyam |   ( Updated:2021-09-27 07:37:53.0  )
చేనేత కళాతృష్ణ..  ఐదుగురికి జాతీయ అవార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఎంతో మంది అవార్డులు పొందారు. పద్మశ్రీ వంటి గౌరవాన్ని కూడా పొందినవారున్నారు. ఇక్కడి చేనేత కళాకారుల కళాతృష్ణకు ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. తాజాగా చేనేత రంగంలో మరికొందరికి జాతీయ స్థాయి గౌరవం దక్కింది. సరికొత్త డిజైన్లు రూపొందించిన వారికి, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ లో సక్సెస్ సాధించిన వారిని కేంద్ర ప్రభుత్వం గౌరవించనుంది. ఈ మేరకు వారికి సంత్ కబీర్ అవార్డు, డిజైన్ డెవలప్మెంట్ అవార్డులు, నేషనల్ మెరిట్ సర్టిఫికేట్లను మార్కెటింగ్ కేటగిరీల్లో ఎంపిక చేసింది.

2018 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 10 సంత్ కబీర్ అవార్డులను(హ్యాండ్లూం వీవర్స్), ఒక సంత్ కబీర్ అవార్డు(మహిళ), 10 నేషనల్ అవార్డులు, రెండు డిజైన్ డెవలప్మెంట్, నాలుగు మార్కెటింగ్, 20 మంది నేషనల్ మెరిట్ సర్టిఫికేట్.. ఇలా మొత్తం 62 అవార్డులు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులు, డిజైనర్లు, వ్యాపార రంగానికి చెందిన వారుండడం విశేషం. ప్రతి ఏటా జాతీయ స్థాయి అవార్డుల ఎంపికలో తెలంగాణ వాటా తప్పనిసరిగా ఉంటుంది. వివిధ చేనేత ఉత్పత్తులను రూపొందించి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కి ఎగుమతి చేస్తోన్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అందుకే జాతీయ చేనేత రంగంలో ఇక్కడి వారి భాగస్వామ్యం సింహభాగంగా కనిపిస్తోంది. రూ.లక్షలు ఖరీదు చేసే చీరలు రూపొందిస్తున్నారు. లక్షణమైన ఉత్పత్తులకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. అలాగే ప్రాచీన డిజైన్లకు ఆధునిక సొగబులు అద్ది నేస్తోన్న చీరలకు కొదువ లేదు. కాకపోతే కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రతి మనిషి జీవనశైలిలో మార్పు వచ్చింది. దాంతో ఖరీదైన ఉత్పత్తులకు కాలం చెల్లినట్లుగా మార్కెట్ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలకు కష్టమొచ్చింది. ఉత్పత్తులు భారీగా నిలిచిపోయాయి. మగ్గం పనుల్లేకపోవడంతో చేనేత కళాకారులు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. కానీ వారిలోని కళాతృష్ణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ అవార్డుల పంట ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తే చేనేత మగ్గం నాలుగు కాలాల పాటు నిలబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

2018 చేనేత అవార్డులు

– నేషనల్ అవార్డు(హ్యాండ్లూం వీవర్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన కొలను పెద్ద వెంకయ్య, ఆయన కొడుకు కొలను రవీందర్ లకు కలిపి ఎంపిక చేశారు. వీరిద్దరు డబుల్ ఇక్కత్ తేలియా రుమాల్ చీరను నేసారు. ఈ చేనేత కళాకారులు శ్రమించి మగ్గంపై నేసిన “పుట్టపాక తేలియా రుమాల్ డబుల్ ఇక్కత్ చీర” జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది.
– నేషనల్ అవార్డు(చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్): నిహారిక సిల్క్ శారీస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం భగవాన్ కు సంబంధించిన వ్యాపార సంస్థకు దక్కింది.
– నేషనల్ మెరిట్ సర్టిఫికేట్(చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన తడక రమేష్ ఎంపికయ్యారు. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు.

రవివర్మ చిత్రాలకు రూపం

నేషనల్ మెరిట్ సర్టిఫికేట్(చేనేత ఉత్పత్తుల్లో డిజైన్ డెవలప్మెంట్)కు హైదరాబాద్ కు చెందిన గౌరంగ్ షా ఎంపికయ్యారు. ఆయన అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఫ్యాషన్ డిజైనర్. ఇప్పటికే దేశ, విదేశీ వేదికలపై తన ఉత్పత్తులను ప్రదర్శించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అనేక రకాల చేనేత చీరలను రూపొందించి పేరు, ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తన డిజైన్లతో అందరినీ మైమరింపజేస్తున్నారు. చేనేత రంగంలో ఆయన తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పురాతన నమూనాలకు ప్రతిరూపమిచ్చారు. ఆఖరికి రవివర్మ గీసిన చిత్రాలను చేనేత చీరలపై చూపించారు. చేనేతలోనే ఆయన గీసిన చిత్రాలకు అచ్చుపోశారు.

అనేక ఉత్పత్తుల సమాహారం

గజం భగవాన్ కు చెందిన నిహారిక సిల్క్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తోంది. సిల్క్ ఇక్కత్, సిల్క్, దూప్యాన్ ఇక్కత్, లినెన్ ఇక్కత్, టస్సార్ సిల్క్ ఇక్కత్, ట్విల్ సిల్క్ ఇక్కత్, కంచి ట్విల్, కంచి ఇక్కత్, ఉప్పాడ జమ్దానీ సిల్క్, ఉప్పాడ జమ్దానీ కాటన్.. అనేక రకాల చీరలను ఉత్పత్తి చేయిస్తున్నారు. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నల్లగొండ, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వందలాది మగ్గాల ద్వారా చేనేత చీరల ఉత్పత్తి చేయిస్తున్నారు. ఆయన సోదరుడు పద్మశ్రీ గజం అంజయ్య నుంచి ఈ విద్యను అలవర్చుకున్నారు. ఆ తర్వాత కొంగొత్త డిజైన్లకు శ్రీకారం చుట్టారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఆయన నేయించిన చీరలు ఉండాల్సిందే. దేశంలోని అనేక నగరాల్లోని షోరూముల్లో గజం భగవాన్ ఉత్పత్తులు కనిపిస్తాయి. ఆయన మార్కెటింగ్ ట్రెండ్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. అలాగే ఎంతోమంది మాస్టర్ వీవర్లకు ఉపాధి లభించింది. తాను చాలా కాలంగా చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ చేస్తున్నానని, కొత్త డిజైన్లను రూపొందించి ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నానని గజం భగవాన్ చెప్పారు. ఇప్పుడీ అవార్డు తన సంస్థకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరింతగా చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం దొరికేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement

Next Story