భూపాలపల్లి తండ్రీకొడుకుల దారుణ హత్య.. గొడ్డలి బ్యాచ్ అరెస్టు

by Sumithra |   ( Updated:2021-06-21 11:22:55.0  )
భూపాలపల్లి తండ్రీకొడుకుల దారుణ హత్య.. గొడ్డలి బ్యాచ్ అరెస్టు
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో ఈనెల19న భూమి తగాదా విషయంలో గ్రామానికి చెందిన ముగ్గురుని కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపిన నిందితులను అరెస్టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్ పి శ్రీనివాసులు తెలిపారు. మృతులు లావుడ్య మంజూ నాయక్(75), లావుడ్య సారయ్య (50), లావుడ్య భాస్కర్(30) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని.. వారి పాలివారు లావుడ్య మహంకాళి, లావుడ్య భాస్కర్, లావుడ్య సర్దార్, లావుడ్య బాబు నాయక్, లావుడ్య. కౌసల్య, లావుడ్య సారయ్య, లావుడ్య బాపు నాయక్, లావుడ్య సమ్మయ్య పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. ముందుగా గొడ్డళ్లు, కర్రలు, కారంపొడి పట్టుకొని గంగారం శివారున ఉన్న సర్వే నెంబర్ 365లోని (20 ఎకరాల- 06 గుంటల) భూమి దగ్గరకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న వారితో గొడవకు దిగారు. భూమిని ఎందుకు దున్నుతున్నారని ప్రశ్నించిన అనంతరం మూకుమ్మడిగా వారిపై కారంపొడి చల్లి ఆ ముగ్గురిని గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరకారు. దీంతో తండ్రి, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ గొడవలో తప్పించుకొని వచ్చిన లావుడ్య మంజూ నాయక్ రెండవ కుమారుడు లావుడ్య సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాటారం పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలించారు.

సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మహదేవ్ పూర్ శివారులో గల ఫారెస్ట్ టింబర్ డిపో దగ్గరకు వచ్చే సరికి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వస్తున్న క్రమంలో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి గొడ్డళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు తెలిపారు. అరెస్టు చేయబడిన వారిలో లావుడ్య మహంకాళి, లావుడ్య భాస్కర్, సర్దార్ లావుడ్య, బాపు నాయక్, లావుడ్య సమ్మయ్య, రంజ్యా నాయక్‌లు ఉన్నారు. వీరి నుంచి మూడు గొడ్డళ్లు, రెండు బైకులు, ఒక కర్ర, మిర్చి పౌడర్ కవర్లు, రక్తంతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి కేసును ఛేదించిన కాటారం డీఎస్పీ బోనాల కిషన్ దర్యాప్తులో వారికి సహకరించిన కాటారం, మహాదేవపూర్ సీఐలు హతిరాం, కిరణ్, ఎస్సైలు సాంబమూర్తి, సత్యనారాయణ, రాజ్ కుమార్, కాటారం సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed