నల్లగొండకు ‘లిఫ్ట్’ మణిహారం..

by Shyam |
నల్లగొండకు ‘లిఫ్ట్’ మణిహారం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఐదు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. పొగిళ్ల, కంబాలపల్లి, అంబా భవాని, పెద్దగట్టు, ఏకేబీఆర్‌ ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.585 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. పొగిల్లకు రూ. 24.64 కోట్లు, కంబాలపల్లికి రూ.202.15 కోట్లు, అంబా భవానికి రూ.184.56 కోట్లు, పెద్దగట్టుకు రూ.82.727 కోట్లు, ఏకేబీఆర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ. 90.96 కోట్లు విడుదల చేయనున్నారు.

నాగార్జున సాగర్ ఉప​ఎన్నిక నేపథ్యంలోనే పథకాలు చేపడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజలకు సాగు, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో అవసరమైన ప్రతిచోట ప్రత్యేక ప్రాజెక్టును, ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆరేండ్లలోనే ఏకంగా రూ. 2,417 కోట్లు వెచ్చించినట్లు సీఎం కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. గ‌త శనివారం ఒక్కరోజే వివిధ పథకాలకు కలిపి రూ.1200 కోట్ల వరకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున సాగర్‌ ఎగువన నిర్మించనున్న నెల్లికల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా బుధవారం శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే.

సాగర్​ సెగ్మెంట్​లోనే ఎక్కువ..

తాజాగా మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాల్లో నాగార్జున సాగర్​కే ప్రాధాన్యత ఇచ్చారు. నాగార్జున సాగర్​ పరిధిలోని నెల్లికల్​ లిప్ట్​కు రూ. 76.16 కోట్లు, ఎల్​ఎల్​సీ పంప్​హౌస్​ నుంచి హెచ్​ఎల్​సీ డిస్ట్రిబ్యూటరీ 8,9 నీటి సరఫరా కోసం మరమ్మత్తులకు రూ. 2.47 కోట్లు కేటాయించారు. అదే విధంగా నాగార్జున్​ సాగర్​ సెగ్మెంట్​ పరిధిలోని SLBC కాల్వ 1.8 కి.మీ నుంచి 70.52 కి.మీ వరకు సీసీ లైనింగ్​ కోసం రూ. 15.78 కోట్లు ఇచ్చారు. వీటితో పాటుగా దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్​నగర్​, కోదాడ, సూర్యాపేట సెగ్మెంట్​లకు కలిపి మొత్తం రూ. 585 కోట్లు విడుదల చేశారు.

Advertisement

Next Story