జాలరికి చిక్కిన గోల్డ్ ఐల్యాండ్.. బయటపడ్డ కోట్ల నిధి

by Shyam |   ( Updated:2021-10-28 08:10:42.0  )
Fishermen
X

దిశ, ఫీచర్స్ : కోట్లాది రూపాయల బంగారు నిధికి ప్రసిద్ధి చెందిన పురాతన సామ్రాజ్యం.. ఇండోనేషియాలో కనుగొనబడింది. బంగారు దీవి(ఐలాండ్ ఆఫ్ గోల్డ్)గా పిలువబడే ఈ రాజ్యం సుమత్రా అనే ప్రాంతంలో బయటపడింది. స్థానిక మత్స్యకారులు గత ఐదేళ్లుగా పాలెంబాంగ్ సమీపంలో మొసళ్లతో నిండిన మూసీ నదిలో ఈ నిధి కోసం అన్వేషిస్తుండగా.. తాజాగా ఓ మత్స్యకారుడికి నది లోతుల్లో వెలకట్టలేని బంగారు నిధి దొరికింది. ఇందులో బంగారు ఉంగరం, నాణేలతో పాటు విలువైన రత్నాలతో అలంకరించబడిన బుద్ధుని విగ్రహం ఉన్నాయి. 8వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం ఖరీదు కోట్లలో ఉంటుందని అంచనా. కాగా ఈ రాజ్యానికి భారతదేశంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తుండగా.. ‘నీటిపై తేలియాడే’ ఈ గ్రేట్ కింగ్‌డమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

భూమిపై ఆఖరి శక్తివంతమైన సామ్రాజ్యం ‘శ్రీ విజయ’

7-13వ శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ‘శ్రీ విజయ’ సామ్రాజ్యం ఒక శతాబ్దం తర్వాత రహస్యంగా అదృశ్యమైంది. కాగా శిథిలమైన రాజ్యానికి సాంప్రదాయ చిరునామాగా ఇప్పటివరకు పరిగణించబడుతున్న పాలెంబాంగ్ నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు తగినన్ని ఆధారాలు సేకరించలేకపోయారని, ఈ సామ్రాజ్యం తన రహస్యాలను పూర్తిగా దాచిపెట్టిందని బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సేన్ కింగ్‌స్లే వెల్లడించారు. ఈ రాజ్య రాజధానిలో 20 వేల మంది సైనికులతో పాటు వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు కూడా నివసించేవారని తెలిపిన సేన్.. ఈ సామ్రాజ్యం ఒకప్పుడు ‘వాటర్ వరల్డ్’ అని, ఇక్కడి కొంతమంది ప్రజలు పడవలపై ఇళ్లను నిర్మించుకున్నారని అన్నారు. ఈ నాగరికత ముగిసినప్పుడు వారి చెక్క ఇళ్లతో పాటు రాజ భవనాలు, దేవాలయాలు కూడా మునిగిపోయినట్లు స్పష్టం చేశారు.

భారత్‌తో సన్నిహిత సంబంధాలు..

ఈ అన్వేషణలో ఆ కాలానికి చెందిన అనేక పాత పాత్రలు, పాన్‌లు కూడా కనుగొనబడగా.. అప్పటికే నాటి ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ సమయంలోనే అత్యుత్తమ టేబుల్‌వేర్ వస్తువులు ఇండియా, పర్షియా, చైనాలోని పెద్ద బట్టీల నుండి దిగుమతి చేయబడ్డాయి. ఇక శ్రీ విజయుల కాలంలో కాంస్య, బంగారు బౌద్ధ విగ్రహాల ఆలయాలు ఉండేవని డాక్టర్ కింగ్‌స్లే తెలిపారు. ఇక్కడే రాహువు శిరస్సు విగ్రహం కూడా దొరికింది. హిందూ విశ్వాసాల ప్రకారం ఇది సముద్ర మథనానికి సంబంధించిన కథలతో ముడిపడి ఉంటుంది. ఇవే కాకుండా భారతీయ, హిందూ విశ్వాసాలకు సంబంధించిన అనేక ఇతర కళాఖండాలు కూడా కనుగొనబడ్డాయి.

శ్రీ విజయ సామ్రాజ్యం ఏమైంది?

శ్రీ విజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది అనే దానికి ఎవరి దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవు. ఇది ఇండోనేషియా అగ్నిపర్వతాల బారిన పడి ఉండవచ్చని డాక్టర్ కింగ్‌స్లే ఊహించారు. దీంతో పాటు నదిలో తీవ్రమైన వరద కారణంగా ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చని కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed