- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ- కథా స్రవంతి' కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ.. బిచ్చగాడు!
బోనులో నిలబడ్డతన్ని అంతా అసహ్యంగా, జుగుప్పగా, భయంగా చూస్తున్నారు. లాయర్లు ఏదో మాట్లాడుకుంటూ అదోలా చూస్తున్నారు. అదొక వింతకేసని భయంకరంగా వర్ణిస్తూ పేపర్లలో రావడంతో తీరుబాటుదారులు ఆసక్తిగా వచ్చి విజిటర్స్ బెంచీల మీద కూర్చుని పక్కనున్నవాళ్లకు ఆ కేసంతా తమకు తెలుసన్నట్టు అతనికి పడబోయే శిక్ష గురించి తీర్పులు కూడా చెప్పేస్తున్నారు.
కోర్టు జవాను కర్ర తాటిస్తూ, “జడ్డిగారు వస్తున్నారు. జడ్జిగారు వస్తున్నారు, జడ్జిగారు వస్తున్నారు.” అంటూ అలవాటు చొప్పున మూడుసార్లు అరిచాడు. సందడిగా ఉన్న వాతావరణం గంభీరంగా మారింది. అంతా లేచి నిలబడ్డారు. న్యాయమూర్తి వచ్చి బోనులో ఉన్న ముద్దాయివంక ఓసారి చిరాకుగా పరికించి తనస్థానంలో కూర్చుంటూ ‘ఇంక మీ వాదనలు ప్రారంభించండి’ అన్నట్టు చూసారు.
ప్రాసిక్యూటర్ లేచి కేసు పూర్వాపరాలన్నీ వివరించి, “యువరానర్, ఈ బిచ్చగాడు.. సారీ… పుట్టు ముష్టివాడ్నని తనే ఒప్పుకున్నాడు. ఇతని ధైర్యమేంటో తెలయలేదు. ముగ్గుర్ని చంపేసానని జంకుగొంకు లేకుండా చెప్తున్నాడు. దానినిబట్టి ఇతని వెనుక ఏదో పెద్దముఠాయే ఉండుంటుందని నా అనుమానం. కనుక ఆ నిజానిజాలు తెలుసుకోడానికి పద్నాలుగు రోజులు పోలీస్ రిమాండుకు పంపించవలసిందిగా కోరుచున్నాను.” అన్నాడు.
“ఇప్పుడు పోలీస్ రిమాండుకు పంపించవలసిన అవసరం ఏముంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది కదా!” అన్నారు న్యాయమూర్తి.
“యువరానర్! ముగ్గుర్ని హత్యచేసాడు సార్. అదీ ప్రభుత్వానికి, ప్రజలకు సేవచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ని, ఒక డీఎస్పీని, ఎమ్మార్వో లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని చంపేసాడు. కానీ ఒక అనుమానముంది. బక్కచిక్కిన ఈ బిచ్చగాడు ఆ ముగ్గుర్ని ఎలా చంపగలిగాడని? ఆ రహస్యం రాబట్టడానికే రిమాండు కోరుతున్నాం మైలార్డ్!” ఆవేశంగా అన్నాడు పి.పి.
జడ్జిగారు నిర్లిప్తంగా బోనులో ఉన్న ముద్దాయి వంక చూసాడు. ఏదో అనాలి కాబట్టి, “ఏమయ్యా! ఏమిటిదంతా? నిజంగానే నువ్వు వాళ్లందరినీ చంపేసావా? ఎందుకు? ఇక్కడే చెప్తావా లేక…?” అసహనంగా ఆపేసారాయన.
అతను అక్కడున్న అందరికి నమస్కరించి గొంతు సవరించుకున్నాడు. “అయ్యా! ఆయనన్నట్టు ఆ ముగ్గుర్నీ నేనే సంపాను. నా ఎనకాల ఎవరూ లేరుబాబూ! నిజం. కావాలని ఈ చేతులతో నేనే సంపేసాను… సంపేసాను.” అని గొల్లుమన్నాడు. అంతలోనే తల కొట్టుకుంటూ, “ఎందుకు సంపేసేనో తెల్సా బాబూ! ఆళ్ళూ బిచ్చగాళ్ళే. నాకు పోటీకొస్తారని సంపేసాను బాబూ!” కుమిలికుమిలి ఏడుస్తూ అన్నాడతను.
“యువరానర్! ఇతనికి మతిస్థిమితం తప్పినట్టుంది. లేకుంటే గెజిటెడ్ రేంకులో ఉన్న అధికార్లితనికి అడుక్కునేవాళ్ళలా కనిపించారంటే ఏమనాలి? ఏదోచెప్పాలి కాబట్టి కథ చెప్తున్నాడు. అందుకే..” అంటూ ఏదో చెప్పబోతున్న పి.పిని ఆపమన్నట్టు చేతులూపాడతను.
“అయ్యా! నన్ను సెప్పమన్నారు. సెప్పేదవకుండానే ఈన మద్దెలో దూరిపోయి ఏదేదో సెప్తున్నారు. కూతంత ఓపిక సేసుకుని నాగోడినండి. నిజవే! నేను పుట్టుబిచ్చగాన్నే. నాకూవ తెలిసేసరికే తాత, అవ్వఅయ్యా, అక్కలు, అన్నలు అంతా అడుక్కునే బతుకుతున్నారు. మా అమ్మ సంకలో నుండే నేనడుక్కోడం మొదలెట్టా. అడుక్కుంటూనే పెరిగా. పెళ్ళికొచ్చాక మా గుడిసెలకి కొత్తగా వచ్చినోళ్ళ పిల్లని సూపించి పెళ్ళాడమన్నారు. పిల్ల నదురుగా ఉంది. నేనూ వయసులో బానే ఉండేవాన్ని. అందుకే అదీ ఒప్పుకుంది.
పెళ్ళయింది బాబూ! అప్పుడు తెలిసింది, నా పెళ్ళాం బిచ్చపుది కాదు, తుపానుకు అన్నీ పోయిన ఓ రైతుబిడ్డనీ, కూతంత చదువు కుందని. అప్పట్నుండి దాన్నడుక్కోడానికి పంపకుండా నేనే రేత్రిపగలు బిచ్చమెత్తి తెచ్చేవాడ్ని. మాకు ముగ్గురు కొడుకులు పుట్టారు. మాపెద్దాడికి ఆరో ఏడు వచ్చింది. ఆడికో బొచ్చెనిచ్చి ఎలా అడుక్కోవాలో నేర్పడం మొదలెట్టా. అది సూసిన నా పెళ్ళాం ఆడి సేతిలోంచి బొచ్చెని లాగిపారేసి “ఈడు అడుక్కోడు. సదువుకుంటాడు.” అంటూ లాక్కుపోయింది.
నేనయోమయంగా సూసాబాబూ! పుట్టుబిచ్చగాళ్ళ వంసంలో పుట్టినోడు సదువుకుంటాడని. నేను దానికి సాలా సెప్పాను. మన ఆసారాన్ని కాపాడుకోవాలి. అడుక్కోవడమంటే మాటలు కాదే.. అదో గొప్ప ఇద్య. అవతోల్ల మనసు కరిగించేసి బిచ్చమేసేలా సెయ్యడం అంటే మాటలు కాదు. దానికి సానా ఇదుండాలి. మరీ అంత సీపుగా సూడకని సాలా సెప్పాను. కానీ అదినలేదు.
దీనికి రెండుపూటలా కడుపునిండుతుంది కనక ఇలాగుందనుకుని అడుక్కోడం తగ్గించేసా. ఇదివరకొచ్చినదాన్లో సగమే రావడంతో తిండి కనాకట్టమయింది. అది పిల్లలకు పెట్టేసి తినీ తినక పుస్తులుంటం మొదలెట్టింది. నాకది తెలియకుండా సేసింది. దీనికెప్పుడు బుదైవత్తే అప్పుడే సొమ్ములు తేవాలనుకుని నేనేదో టి బయట తినేసి రోజురోజుకు డబ్బులింకా తక్కువివ్వడం మొదలెట్టా. కానీ అది ఏరోజు ఇదేంటని అడగలేదు. కుర్రోడ్ని అడుక్కోడానికి ఒప్పుకోలేదు.
ఓసారింటి కొచ్చేసరికి జనం మూగున్నారు. ఏటనుకుని సూద్దునా నా పెళ్ళాం కిందపడిపోయుంది. అప్పుడే జనం పట్టుకుని మంచంమీది పడుకోబెడుతున్నారు. అప్పుడే వచ్చిన డాటరుబాబు సూసి, ‘ఇది తిండి మానేసి సాలారోజులయింది. ఇక్కడేం సెయ్యలేం. కావాలంటే పెద్దాసుపత్రికి తీసుకెల్లండి. కానీ బతుకుని నమ్మకం లేదు. పెళ్ళానికి తిండి పెట్టలేనో డికి పెళ్ళెందుకురా. ధూ!’ అంటూ ఊసి ఎల్లిపోయాడు. అక్కడున్నంతా అలాగే సూసి ఎల్లిపోయారు.
నా పెళ్ళాం వంక బిక్కుబిక్కుమంటూ సూసాను. అయినా దాని కళ్ళలో నామీద అసయ్యం కనపడలేదు బాబయ్య. అది దగ్గరరకు రమ్మని పిలిసింది. ఎల్లి పట్టి మీద కూర్చుని, ‘ఇదేంటే! తిండి తినకపోడం ఏంటి?” నా తప్పు నాకు తెలుత్తున్నా ఏదోటి అనాలి కాబట్టి అన్నా. అందుకది నవ్వి, “అయ్యా! అయన్నీ వదిలెయ్. మనకి ముత్తాల్లాంటి ముగ్గురు బిడ్డలు పుట్టారు. కానీ ఆళ్ళు మనలా బిచ్చగాళ్ళు కాకూడదయ్యా. ఆళ్ళను ఏదన్నా ఆస్టల్లో సేర్పించి సదివించు. అక్కడన్నీ ఆళ్ళే సూసుకుంటారు. ఆళ్ళ గొప్పోల్లయితే ఆడనుండి సూసి సంతోసిత్తానయ్యా. ఈ ఒక్కమాటియ్యి…. మా..వా..” బాధతో మెలికలు తిరుగుతూ ఉంది.
నేనేం ఆలోసించకుండా సేతిలో సెయ్యేత్తుండగానే అది సచ్చిపోయింది బాబయ్యా. సేతులారా పెల్లాన్ని సంపుకున్నోడ్ని. కనీసం దాని సివరి కోరికైనా తీర్చాలనుకుని మనసులోనే ఒట్టేసుకున్నా. ఇంకా రోజునుండి అదేపట్టుగా సంపాదించుకుంటా నా పిల్లల్ని సదివించా. కర్సు పెరుగుద్దని మల్లీ పెల్లి కూడా సేసుకోలేదు. ఆ తల్లి కోరిక తీరుత్తూ ఆళ్ళు పెద్ద సదువులు సదువుకున్నారు బాబయ్యా. కష్టపడి మంచిమంచి ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నారు.
ఆల్లాయగా కాపురాలు సేసుకుంటూ ఉంటం సూసి నా పెల్లాం పొటోవా ముందు నిలబడి ‘సూసావా! నీ కొడుకుల్ని మారాజుల్ని సేసా. గుడిసెలో ఉన్నా నాదేం పోదే. నేనిక్కడే పుట్టా కదే. కానీ ఆళ్ళు.. మేడల్లో మిద్దెలో మా గొప్పగా ఎలిగి పోతున్నారు. నువ్వన్నది నిజవేనే. సదూకుంటే గొప్పోల్లవుతారు.” అంటుంటే అది నవ్వుతున్నట్టుండేది బాబూ. అది సూసి నాకెంత సంతోసంగా ఉండేదనీ!
నా పెద్దకొడుకు డిప్టికలకటేరు, రెండో వోడు పెద్ద పోలీసు బాబూ, మూడో వోడు తాసిల్దారూనూ. ఇందాక ఈ లాయరు బాబు మా గొప్పగా చెప్పిన ఈ ముగ్గురూ నా కొడుకులే బాబూ. ఓరోజు నాకు రోజూ బిచ్చం పెట్టే పంతులుగారి కొడుకు పోలీసుకేసులో ఇరుక్కున్నాడు. ఆఖరాట సినిమా సూసి వత్తుంటే ఎవరో ఒకమనసిని సంపిపోడం సూసి పోలీసోల్లకు పోన్ సేసేడట. పోలీసులొచ్చి నువ్వే సంపేవని ఆ బాబును పట్టుకుపోయారట. పంతులుగారు వలవల ఏడత్తుంటే ఆయనకు ధైర్యం సెప్పి నా రెండో కొడుకు దగ్గరకు ఎల్లాను.
ఆడు సంగతంతా ఇని, “నీకియన్నీ ఎందుకు? అడుక్కునే వాడివి అలాగే ఉండు. ఈ కేసులో సంపినవాడు రెండు లచ్చలిచ్చాడు. ఈడేం ఇత్తాడు మట్టి. కట్టపడి సదువుకున్నది నీలా ముట్టోల్లని కంటానికి కాదు. మారాజుల్ని కంటాను. ఇంకెల్లు. నాకు పనుందని గెంటినంత పనిసేసి తలుపేసుకున్నాడు.
నేను పెద్దాడి దగ్గరకు ఎల్లాను. ఆడంతా ఇని నే సెప్తేనే తమ్ముడీ పని సేసేడు. సూసిసూడనట్టు ఉంటానికి నాకు ఐదులచ్చలు ఇచ్చారాలు. నీ మాటింటే ఏటుంటాది ముట్టి. సూడు. కన్నావ్ పెంచావ్. మాబతుకులేయ్ మేం బతుకుతున్నాం. మమ్మల్నిలా బతకనియ్.” అని సిరాగ్గా అనేసరికి ఏం సేయాలో తెలియక తాసిల్దారు కొడుకు దగ్గరకెల్లా. ఏంట్రా ఇది. నీ అన్నలిలాగయిపోయారు. మీరు ఎవర్నీ అడుక్కోకూడదనే కదా నేనింత కష్టపడి సదువులు సెప్పించింది. ఇలా సేసేరేంటనడిగా.
అందుకాడు ఇరగబడినవ్వి, “సూడు. నువ్వు మమ్మల్నేదో ఉద్దరించావని తెగిదయపోతున్నావేమో. కన్నాక పందయనా ఆ మాత్రం సేయకుండా ఉండదు. అదేం గొప్పా. సంపినోడు ముందు నాదగ్గరకొచ్చి లచ్చరూపాయిలు సేతుల్లో ఎట్టాకనే అన్నలకు సెప్పా. ఆళు కేసు తిప్పేసారు. ఇది బిచ్చం కాదు. బగుమానం. ఇంక పో. నా కొడుకులు అని సెప్పుకోకు. కూతంత గౌరవంగా బతుకుతున్నాం.” అంటూ చిరాకుపడటంతో బయటకొచ్చేసాను.
నేనింటికొచ్చి నా పెళ్ళాం వంక సూసేను. అది ఇరగబడి నవ్వుతున్నట్టనిపించింది. నా కొడుకుల్ని బిచ్చగాళ్ళను సెయ్యొద్దంటే నీ కంటే పెద్ద బిచ్చగాళ్ళను నేసేవుగదయ్యా. ఇదేనా నీ మాటన్నట్టనిపించింది. నిజవే. నేను రూపాయి, రెండూ అడుక్కునే బిచ్చగాన్ని. ఈళ్ళు లచ్చ రెండు లచ్చలు అడుక్కునే బిచ్చగాల్లయారు. ఈల్లు అడుక్కోకూడదనే కదా ఇంతిదయ్యాను. నా పెంపకంలో లోటుందో లేక ఆళ్ళ రక్తంలో అదుందో.. ఈళ్ళూ బిచ్చగాళ్యయిపోయారు.
ఔను బాబుగోరూ. నాకూ ఆళ్ళకీ తేడా ఏటంటే. నేను సింపిరి గుడ్డల్లో కలిగినోళ్ళను, దయగలమారాజుల్ని అడుక్కుంటాను. కానీ, ఆళ్ళు తప్పుడు మడుసుల దగ్గర అడుక్కుని నన్ను గెంటేసినట్టే పెదోన్ని నట్టేట ముంచేత్తన్నారు బాబూ. సేసిన కట్టానిక ఎంతొత్తే అంత తింటే అది నాయం. కట్టపడి బిచ్చమెత్తుకుని తింటున్నా. కానీ ఈళ్ళు పనిచేసినందుకు గవరమెంటోల్లు బోల్డంత డబ్బిత్తున్నారు కదా. మల్లీ ఆల్లనీఈల్లనీ అడుక్కోడమెందుకు బాబూ.
సివరికి నా కొడుకులు ముగ్గురూ కలిసి పంతులుగారి కొడుక్కి పద్నాలుగేళ్ల జైలు సిచ్చేపించారు. అది తట్టుకోలేక ఆ కుటుంబమంతా ఇసం తాగి సచ్చారు. ఈ పాపం ఎవరిది బాబూ. ఈళ్ళని పెంచి సదివించిన నాదే కదా. ఆనాడే నాలా బిచ్చగాళ్ళను సేసుంటే నేనూ, నా పెల్లాం సుకంగా ఉండేటోల్లం. పంతులుగారి కుటుంబానికి ఈ గోరం జరిగేది కాదు.
అందుకే బాబు ఓరోజు గుడిసె అమ్మేసాను. వచ్చి డబ్బులు తీసుకెల్లండ్రా బాబులూ అంటే ఎగేసుకొచ్చారు. ఒక్కడు కూడా మరి నువ్వెడుంటావ్ అయ్యా అని అడగనేదు బాబూ. ఆళ్ళకి డబ్బులు సూపించి మంచిరేటొచ్చిందని సీటు తెప్పించా తినండ్రా బాబూ, మల్లీ ఎన్నాల్లకో మనమిలా కలుసుకునేది. అని నేనే ఇసం కలిపిన సీటు తినిపించా. తిన్న కాసేపటికే గిలగిల కొట్టుకుని కల్లెదుటే సచ్చి పోయారు బాబూ. ఇప్పుడు నాకు కొడుకులు లేరు. నేను బిచ్చగాళ్ళను కనలేదు. ఇప్పుడు నా పెళ్ళాం వంక సూసాను. ఇది వరలా అది నవ్వుతే కనిపితే మురిసిపోయా.
కానీ ఒకటే బాద బాబూ! ఎవరో జడ్జి బాబుగారు కూడా అడుక్కుని బిచ్చగాడయ్యాకనే పంతులుగారి కొడుక్కా సిచ్చ ఏసాడంట. ఆడెవడో నాకు తెలియలేదు కానీ తెలితే ఆ బిచ్చగాడ్ని కూడా నా బిచ్చగాల్ల కొడుకుల దగ్గరకు పంపించేద్దును బాబూ” అన్నాడు.
బోనులో ఆ మాటలు వినగానే జడ్జిగారు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు కోర్టులో ఉన్నవారి చూపుల్లో జుగుప్స కనిపిండం లేదు. బిచ్చగాడు కాదు.. ఓ మహానుభావుడు కనిపిస్తున్నాడు!!!
ముసునూరి సుబ్బయ్య.. 9949941996