తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం

by vinod kumar |   ( Updated:2020-05-21 06:43:08.0  )
తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం
X

దిశ, నల్లగొండ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. దాదాపు మూడు నెలలుగా ఏమాత్రం తగ్గకుండా విజృంభిస్తోంది. డాక్టర్లను సైతం వదలకుండా విలయతాండవం చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో కరోనాతో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. వివరాళ్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మామిళ్లగూడెం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి(37) హైదరాబాద్ నగరంలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో పురానాపూల్ సమీపంలోని చెక్ పోస్టులో అధికారులు ఆయనకు విధులు అప్పగించారు. అయితే ఈ ప్రాంతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జియాగూడ మార్కెట్‌కు సమీపంలో ఉంది. కాగా స్థానికులను పరిశీలిస్తున్న క్రమంలో ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించి, ఆయనతోపాటు డ్యూటీలో ఉన్న సిబ్బందిని క్వారంటైన్‌‌లో చేర్చారు. గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో దయాకర్‌రెడ్డి మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకూ తెలంగాణ పోలీసు శాఖలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇది తొలి కరోనా మరణంగా అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed