లక్షలు పెట్టాం.. మాకు దిక్కు ఏది

by Sridhar Babu |
లక్షలు పెట్టాం.. మాకు దిక్కు ఏది
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పటాసుల వ్యాపారులపై పెద్ద బాంబు పడింది. స్టాల్స్ పెట్టుకున్నాక పటాసుల నిషేధించడం ఏంటని వ్యాపారులు మండిపడుతున్నారు. లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా పెట్టి పటాసులు తీసుక్కొచ్చామని, పర్మీషన్‌కూ ఖర్చు పెట్టామని, ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి రెండు రోజులు ఉండగా చెప్పడం ఏంటని.. ముందే చెప్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 10 హోల్ సేల్ దుకాణాల ద్వారా పటాసులు విక్రయిస్తున్నారు.

రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండడంతో పటాసుల వ్యాపారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పలు చోట్ల స్టాళ్లు ఏర్పాటు చేసుకోగా.. మరికొన్ని చోట్ల స్టాళ్ల ఏర్పాటుకు రెడీ అయ్యారు. పటాసులు కొనుక్కొచ్చి పెట్టుకున్నామని, ఇప్పుటు వాటి పరిస్థితి ఏంటని వాపోతున్నారు. కరోనా బాధితులు ఉన్నందున పటాసులు కాల్చొద్దని గురువారం హై కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా కరోనా బాధితుల విషయాన్ని పట్టించుకోకుండా లైసెన్సులు జారీ చేయడంతో తాము వ్యాపారం చేసుకోవచ్చనే ధీమాతో వ్యాపారులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 10 హోల్ సేల్ దుకాణాల ద్వారా 410 మంది రిటేల్ షాపుల ద్వారా సుమారు రూ. 10 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంటారు.

పది రోజుల ముందు నుంచే..

దీపావళి పండుగ సందర్భంగా పటాసుల స్టాల్ ఏర్పాటుకు పది రోజుల ముందు నుంచే ఆఫీసుల చుట్టూ పర్మీషన్ కోసం తిరిగారు. ఫైర్, మున్సిపల్, పోలీస్ తదితర విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకుని ఫైనల్ లైసెన్స్ తీసుకునేందుకు వ్యాపారులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఆయా విభాగాలకు చలాన్ల రూపంలో డబ్బులు కూడా కట్టినట్లు పలువురు చెప్తున్నారు. ఆయా జిల్లా అధికారులు నిర్ధేశించిన స్థలంలో స్టాళ్ల ఏర్పాటుకు అవసరమైన స్టీల్ షీట్స్, టెంట్స్, కర్రలు, సేఫ్టీ ప్రికాషాన్స్ కోసం డబ్బులు కూడా చెల్లించారు.

కోట్లలో అడ్వాన్స్..

పటాసుల కోసం హోల్ సేల్ వ్యాపారులకు రిటేల్ వ్యాపారులు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తమకు ఎంత స్టాక్ కావాలో అంచనా వేసుకుని అందుకు అడ్వాన్స్‌గా అమౌంట్ ఇవ్వాలి. స్టాల్ ఏర్పాటు చేసే వ్యాపారి రూ. 2 లక్షల వరకూ అడ్వాన్స్‌గా నగదును హోల్‌సేల్ షాపులకు అప్పగించారు. హైకోర్టు నిర్ణయంతో తాము క్రాకర్స్ అమ్ముకునే అవకాశం లేదని, తామిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని హోల్‌సేల్ వ్యాపారులను అడిగితే తాము కంపెనీలకు పంపించామని చెప్తున్నారని రిటైలర్స్ అంటున్నారు.

లక్షల రూపాయలు నష్టపోయాం..

తాము అన్ని రకాల అనుమతులు తీసుకుని స్టాళ్లను ఏర్పాటు చేస్తుండగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో లక్షల రూపాయలు నష్టపోయాం. హోల్‌సేల్ వ్యాపారికి అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదుతో పాటు స్టాల్స్ కోసం వెచ్చించిన డబ్బు, లైసెన్స్ డబ్బు వృథా అయినట్లే..

-పెద్ది వేణు, పటాసుల వ్యాపారి, కరీంనగర్

జాగ్రత్తలు కూడా చెప్పారు..

క్రాకర్స్ స్టాళ్లలో సేఫ్టీగా ఉండాలని ఇటీవల జిల్లా అధికారులు ప్రత్యేకంగా తమతో సమావేశం నిర్వహించారు. దీంతో పటాసులు వ్యాపారం సాగుతుందని ఆశించి, లక్షల్లో డబ్బులు వెచ్చించాం. కానీ, హైకోర్టు తీర్పుతో పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయాం.

-ఎం.అశోక్, పటాసుల వ్యాపారి, కరీంనగర్

మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు

పండుగ రెండు రోజులే ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ నిర్ణయం ముందుగా చెప్తే బాగుండేది. ఒక్కో స్టాల్ కోసం రూ. 25 వేల వరకు డబ్బులు వెచ్చించాం. లైసెన్స్ కోసం, క్రాకర్స్ కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి మా చేతికి వచ్చే అవకాశం లేదు. ఆర్థికంగా నష్టపోయిన మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు.

ఆముద రాజు, పటాసుల వ్యాపారి, జగిత్యాల

అడ్వాన్స్ డబ్బులు పోయినట్లే..

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ డబ్బులు అడగడంతో అందరికీ ముందే చెల్లించాం. ఇక ఆ డబ్బులు పోయినట్లే.. ఇతర రాష్ట్రాల్లో చెప్పినట్లుగానే మన రాష్ట్రంలో కూడా ముందస్తుగా పటాసులు అమ్మొద్దని ప్రభుత్వం చెప్తే బాగుండేది.

ఇమ్మడి ధర్మయ్య, జగిత్యాల

Advertisement

Next Story

Most Viewed