బ్యాంకులు, బీమా కంపెనీల ఉద్యోగుల టీకాకు ప్రాధాన్యత!

by Harish |
banks
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అధిక ప్రభావానికి గురయ్యే రంగంలో ఉన్న బ్యాంకులు, బీమా కంపెనీల ఉద్యోగులకు టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బ్యాంకులు, బీమా ఉద్యోగులకు వీలైనంత త్వరగా టీకా వేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ దెబాసిష్ పాండ్ లేఖ పంపించారు. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులను ఉద్దేశించి బ్యాంకులు, బీమా కంపెనీల సిబ్బంది, బిజినెస్ కరస్పాండెంట్లు, పేమెంట్ విభాగం, ఇతర ఆర్థిక సేవల విభాగం వారికి ప్రత్యేకంగా టీకా పంపిణీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

మహమ్మారి సంబంధిత సవాళ్లు కొనసాగుతున్న సమయంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు బ్యాంకులు, బీమా సంస్థలు, పేమెంట్ వ్యవస్థలోని వారు ఎంతో కృష్టి చేశారని దెబాసిష్ తెలిపారు. ఈ చర్య వల్ల ప్రజలకు అందించే సేవల్లో అంతరాయం ఉండదని దెబాసిష్ లేఖలో వివరించారు. అలాగే, బ్యాంక్, ఆర్థిక సేవల్లో ఉన్న ఉద్యోగులకు సహకరించాలని, వారికి తగిన భద్రత కల్పించాలని, వారి పనితీరుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని స్థానిక అధికారులకు సూచించాలని ప్రధాన కార్యదర్శులను కోరారు. కాగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం పట్ల ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీ హెచ్ వెంకటాచలం సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story