పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!

by Harish |
పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లు 15 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే భారీగా ఎఫ్‌డీఐలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటిసగంలో సుమారు రూ. 2.22 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో ఎఫ్‌డీఐలు సుమారు రూ. 1.92 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన జియో, రిలయన్స్ రిటైల్ విభాగాల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం వల్లే ఎఫ్‌డీఐలు పెరిగాయి

గణాంకాలను పరిశీలిస్తే సాఫ్ట్ వేర్, హార్డ్‌వేర్ రంగాలు 17.5 బిలియన్ డాలర్లతో అధిక ఎఫ్‌డీఐలను నమోదు చేశాయి. మిగిలిన 9 రంగాల్లో పెట్టుబడులు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సేవల రంగంలో 17 శాతం పెట్టుబడులొచ్చాయి. సేవల రంగంలోనే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఔట్‌సోర్సింగ్, బీమా రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లో 12 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయని గణాంకాలు పేర్కొన్నాయి. టెలికాం రంగంలో 7 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి. కొవిడ్-19 వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీతో ద్రవ్యతను పెంచాయి.

దీంతో భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. వచ్చే ఏడాదిలో కాంట్రాక్ట్ తయారీ, బొగ్గు తదితర రంగాలు మరిన్ని విదేశీ పెట్టుబడులను రాబట్టే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా విదేశీ పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed