చనిపోయిన నాన్న.. కూతురిని దీవించిన వేళ!

by Anukaran |   ( Updated:2021-02-05 05:37:39.0  )
చనిపోయిన నాన్న.. కూతురిని దీవించిన వేళ!
X

దిశ, ఫీచర్స్: కొన్నేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ పారిశ్రామికవేత్త శ్రీనివాస్‌ గుప్త సతీమణి మరణించగా, ఆమె జ్ఞాపకార్థం మైనపు విగ్రహం తయారుచేయించిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహంతోనే తను గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా.. శుభకార్యానికి వచ్చిన అతిథులు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే ఇక్కడ దివంగత తండ్రి మైనపు విగ్రహాన్ని తయారు చేయించి సిస్టర్ పెళ్లి వేడుకలో అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది వధువు సోదరి.

తమిళనాడులోని తంజావురు జిల్లా, పట్టుకొట్టై గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి సెల్వంకు ఇద్దరు కూతుర్లు. కూతుర్లపై ఉన్న ప్రేమతో చాలా కష్టపడి వారిని ఉన్నత చదువులు చదివించిన సెల్వం దంపతులు.. పిల్లల జీవితం బాగుండాలని కలలు కన్నారు. కానీ దురదృష్టవశాత్తు సెల్వం అనారోగ్యంతో చనిపోవడంతో అప్పట్నుంచి ఆయన భార్య ప్రభ.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ క్రమంలోనే వీరి రెండో కూతురు లక్ష్మి ప్రభకు కుమారపలయంకు చెందిన కిశోర్‌తో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి నిమిత్తం లండన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన లక్ష్మి ప్రభ అక్క భువనేశ్వరి.. తన సోదరి పెళ్లిలో తండ్రి మైనపు విగ్రహం పెట్టించి సర్‌ప్రైజ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు భువనేశ్వరి తన భర్త కార్తీక్ శివకుమార్‌ కలిసి బెంగళూరులోని ఫేమస్ మైనశిల్పి సిధారమూర్తిని కలిశారు. పెళ్లికి ముందు రోజులోగా అచ్చం మనిషిలా ఉండే సెల్వం మైనం విగ్రహాన్ని తయారు చేయాలని కోరారు. కాగా సెల్వం ఫొటోలు చూసిన మూర్తి.. రబ్బర్, సిలికాన్, మైనం, ఇతర సామగ్రితో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అనుకున్న సమయానికి మైనం విగ్రహాన్ని అందించడంతో.. మ్యారేజ్ హాల్‌లో పెట్టారు. వివాహ అనంతరం లక్ష్మి ప్రభ-కిషోర్ దంపతులు, అతిథులు సెల్వం విగ్రహం చూసి తొలుత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత నవదంపతులు మైనం విగ్రహం వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తొమ్మిదేళ్ల నుంచి తన తండ్రి లేని లోటు విగ్రహం చూడగానే తీరిందని, తను నిజంగా నాతో ఉన్న భావన కలిగిందని నవవధువు లక్ష్మి ప్రభ చెప్పగా.. తనను చాలా మిస్ అవుతున్నానని సెల్వం భార్య ప్రభ కన్నీటి పర్యంతమయ్యారు. అది విగ్రహం కాదని, తన భర్తే ఇంటి పెద్దగా వచ్చి తన కూతురికి ఆశీస్సులు అందించి పెళ్లి జరిపించినట్లుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా, మనిషిలానే ఉన్న మైనపు విగ్రహం ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరూ విగ్రహం వద్ద ఫొటోలు తీసుకున్నారు. తన తండ్రి తమకు రోల్ మోడల్ అని, తమను చదివించేందుకు ఎంతో కష్టపడ్డారని, తాము ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉండటానికి ఆయనే కారణమని చెప్పిన మొదటి కూతురు భువనేశ్వరి.. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ విగ్రహాన్ని అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story