ఢిల్లీని దిగ్బంధిస్తాం : రైతులు

by Anukaran |
ఢిల్లీని దిగ్బంధిస్తాం : రైతులు
X

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా గుమిగూడిన రైతులు కేంద్రం సూచించిన బురారీ పార్క్‌కు వెళ్లడానికి నిరాకరించారు. తాము నిర్దేశించుకున్న జంతర్ మంతర్‌లోనే నిరసనచేయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే తమ ఆందోళనలు కొనసాగిస్తామని, దేశరాజధానిలోకి వెళ్లే ఐదు మార్గాలను దిగ్బంధిస్తామని స్పష్టం చేశారు. సరిహద్దులోని సింఘు దగ్గర విలేకరులతో రైతు సంఘాల నేతలు మాట్లాడారు. భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి పంజాబ్ యూనిట్ అధ్యక్షుడు సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ, తాము బురారీ పార్క్‌కు వెళ్లమని తేల్చేశారు. అది పార్క్ కాదని, ఒక బహిరంగ జైలుగా తమకు తెలిసిందని వివరించారు.

ఉత్తరాఖండ్ నుంచి కొందరు రైతు సోదరులు ఢిల్లీ చేరుకున్నట్టు తెలిసిందని, అనంతరం వారు అక్కడి నుంచి జంతర్ మంతర్ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులకు తెలిపారని అన్నారు. వారిని జంతర్ మంతర్‌కు తీసుకెళ్తామని చెప్పి, బయటకు వెళ్లకుండా పోలీసులు వారిని బంధించినట్టు సమాచారం అందిందని చెప్పారు. అందుకే జంతర్ మంతర్ దగ్గర నిరసనకు అనుమతినిచ్చే వరకు సరిహద్దులోనే ఆందోళన కొనసాగిస్తామని, ఇందులో ఏ రాజకీయ పార్టీని అనుమతించబోమని స్పష్టం చేశారు. చర్చలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆహ్వానాన్నీ రైతులు తిరస్కరించారు. కేంద్రం సూచించిన బురారీ సమీపంలోని నిరంతకారి గార్డెన్‌కు చేరుకుంటే వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అమిత్ షా శుక్రవారం తెలిపారు. కానీ, కండీషన్ పెట్టి చర్చలకు ఆహ్వానించడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకించాయి.

నాలుగు డిమాండ్లు..

రైతు సంఘాలు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పంటకు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇవ్వాలని, పంటనష్టాలను కాల్చివేస్తే విధించే జరిమానాలు తొలగించాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్ నిలిపేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్ 2020తో కరెంట్ బిల్లులపై రైతులు పొందే సబ్సిడీ రద్దు కానుంది.

Advertisement

Next Story

Most Viewed