- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాసంగి మనీ.. రాలే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతకు తమ సర్కారు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పంట ఉత్పత్తులను అమ్మితే అక్కడ ఎంఎస్‌పీ లభించడంతోపాటు రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేస్తారు. అవినీతికి ఆస్కారముండదు. ప్రతి కొనుగోలుపై ప్రభుత్వం జవాబుదారీతనం ఉంటుంది. ఈ మాటలు ఏటా పంటల కోత కాలంలో అధికార యంత్రాంగం, పాలకులు చెప్పడం, వాటిని వినడం రైతులకు పరిపాటే. పాలకులు చెప్పిన మాటలు ఆచరణలో అమలు కావడం లేదని చెప్పేందుకు షెట్పల్లి సొసైటీ నిర్వాకమే నిదర్శనం.
మంత్రి వేముల ఇలాకాలో..
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందూరు జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలోని షెట్పల్లి సొసైటీలో రైతన్నల నుంచి యాసంగి పంట కొనుగోళ్లు జరిగాయి. కానీ, డబ్బులు ఇప్పటికీ రాలేదు. రైతులకు సుమారు రూ.30 లక్షల వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. యాసంగి డబ్బులు చెల్లించకుండా..ఇప్పుడు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు షురూ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. మోర్తాడ్ మండలంలోని పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) దోనకల్ గ్రామ రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేసింది. కొనుగోలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని అన్నదాతలు చెబుతున్నారు. డోనకల్ గ్రామ రైతులకు దాదాపు రూ.20 లక్షలు రావాల్సి ఉండగా, షెట్పల్లి గ్రామ రైతులకు రూ.10 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.30 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.
పాలకవర్గ చర్యలేవి..?
యాసంగి ధాన్యం కొనుగోలు డబ్బులు అందలేదని షెట్పల్లి సొసైటీ పాలక వర్గ సభ్యులకు, కార్యదర్శికి విన్నవించినప్పటికీ తమకు ఏమీ తెలియదని అంటున్నారని రైతులు చెబుతున్నారు. మిల్లర్‌లతో మాట్లాడి ఇస్తామని కార్యదర్శి చెబుతున్నారే తప్ప, మాట్లాడించడం లేదని రైతులు ఆరోపించారు. ఈ విషయమై చైర్మన్, పాలకవర్గ సభ్యులు అడిగితే తమకు డబ్బుల విషయంతో సంబంధం లేదని చెబుతున్నారని రైతులు వాపోయారు. రైస్ మిల్లర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, కొనుగోలు కేంద్రాలలో రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీయొద్దని సొసైటీ అధికారులకు, పాలక వర్గ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ, వాటని బేఖాతరు చేస్తూ 5 కిలోల తరుగు తీశారని, హమాలీల పేరుతో లారీలలో లోడు చేసినందుకు, వరి ధాన్యం సంచులు నింపినందుకు, కుట్టినందుకు, ఒక్కొక్క క్వింటాలుకు రూ.40 చొప్పున హమాలీల డబ్బులను రైతుల వద్ద వసూలు చేశారని దోనకల్ గ్రామ రైతులు వాపోయారు. కరోనా పరిస్థితుల వల్ల ఈ విషయాలను తాము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లలేకపోయామని రైతులు అంటున్నారు. సొసైటీ అవకతవకలపై విచారణ జరిపించి, తమకు యాసంగి డబ్బులు వెంటనే అందించాలని ఆఫీసర్లను రైతులు కోరుతున్నారు.
బక్క రైతులకు భరోసా లేదు..
నాకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో రెండున్నర ఎకరాల్లో సన్న వడ్లు, రెండున్నర ఎకరాల్లో దొడ్డువి నాటాను. వ్యవసాయ అధికారులు చెప్పినట్లు సన్న సీడ్‌నే వేశాను. పంట చేతికొచ్చే దశలో దోమపోటు, కాటుక రోగం రావడంతో సన్నరకం పంట దెబ్బతిన్నది. ముఖ్యమంత్రి సారు చెప్పినట్లు చేస్తే లాభం లేకుండా పోయింది. పైగా రూ.40 వేల వరకు అప్పు అయింది. దొండు రకం పండిస్తే కనీసం పంటకు రోగం రాకుండా ఉండేది. ఈ సీజన్‌లో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. దాంతో బక్క రైతులకు భరోసా లేకుండా పోయింది. మద్దతు ధర లేక అగ్గువకే అడ్తి వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది.
-నవీన్ కుమార్, బర్దిపూర్ గ్రామ రైతు