మంత్రి హరీష్ రావుకు అనూహ్య షాక్.. కారు దిగేలా చేసిన రైతులు

by Shyam |   ( Updated:2021-11-30 04:46:48.0  )
Minister Harish Rao
X

దిశ, ఆందోల్/అల్లాదుర్గ్: మంత్రి హరీష్ రావుకు రైతుల నుంచి అనూహ్య షాక్ తగిలింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద 161 నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి, మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలులో జరుగుతోన్న జాప్యానికి నిరసనగా మంగళవారం నిరసన చేపట్టారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన ఉందన్న విషయం తెలుసుకొని, రైతులు కాన్వాయ్ అడ్డుకొని, రోడ్డుపై బైఠాయించారు. అంతేగాకుండా.. ‘‘కేసీఆర్.. కేటీఆర్.. టీఆర్ఎస్ డౌన్ డౌన్’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

నారాయణఖేడ్ నుంచి అల్లాదుర్గం మీదుగా జోగిపేటకు వస్తోన్న మంత్రి కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి హరీష్ రావు కారు దిగి రైతుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మంత్రి హరీష్ రావు అక్కడి నుంచే మెదక్ ఆర్డీవో సాయిరామ్‌కు ఫోన్ చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగకూడదని, కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గంటలో అధికారులు ఇక్కడికి రావాలని, వెంటనే కొనుగోలు చేపట్టాలని ఫోన్‌లో హెచ్చరించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. రేపటిలోగా వరిధాన్యం కొనుగోళ్ల సమస్యను పరిష్కారం కాకపోతే పండించిన పంటను తగలబెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని రైతులు అధికారులను హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed