చట్టాల సమర్థకులను తొలగించండి

by Shamantha N |
చట్టాల సమర్థకులను తొలగించండి
X

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై నియమించిన కమిటీలోని ముగ్గురు సభ్యులను కూడా తొలగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాల్లో ఒక్కటైన భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) సుప్రీంకోర్టు‌ను ఆశ్రయిచింది. వ్యవసాయ చట్టాలను ఇదివరకే సమర్థించిన నలుగురు సభ్యులతో కమిటీ వేయడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు వేసిన కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ నెల 14న భూపిందర్ సింగ్ మన్ ప్రకటించారు. ఆయన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ దక్షిణాసియా డైరెక్టర్ ప్రమోద్‌కుమార్ జోషి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైస్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ, షెట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఈ ముగ్గురిని తొలగించడంతోపాటు గణతంత్ర దినోత్సవం నాడు తలపెట్టిని కిసాన్ ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ రైతు సంఘాల నేతలు సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌‌లో కోరారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 18న విచారణకు రానున్న నేపథ్యంలో అప్పుడే వాదానలు వింటామని చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రైతు సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టాలను సమర్థించిన వారితో కమిటీ వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

కమిటీలోని సభ్యులు చట్టాలను సమర్థించిన నేపథ్యంలో రైతుల వాదనలను సహేతుకంటా వింటారని నమ్మకం ఏమిటని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆందోళన చేస్తున్న రైతులు దేశ భక్తులు అని, రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు తలపెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ఈ వారంలో ఓ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇప్పటికే సీఆర్‌పీసీ 144 సెక్షన్ ప్రకారం న్యూఢిల్లీ ర్యాలీలు, నిరసన‌లపై ఆంక్షలు ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed