నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి – జస్టిస్ రమణ

by Anukaran |   ( Updated:2020-10-18 11:12:10.0  )
నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి – జస్టిస్ రమణ
X

దిశ, వెబ్ డెస్క్: న్యాయ వ్యవస్థకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద బలమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటూ నమ్మిన సూత్రాలపై నిలబడాలని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏఆర్ లక్ష్మణన్ ఈ ఏడాది ఆగస్టు 27న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన సంతాప సభ శనివారం జరిగింది.

ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే వినయం, ఓర్పు, దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతర అధ్యయనం వంటి ఎన్నో సుగుణాలను అలవర్చుకోవాలని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఆమోదయోగ్యతలు బలవంతపెడితే వచ్చేవి కావని, వాటిని సంపాదించుకోవాల్సిందేనని చెప్పారు.

న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్న బార్‌ బెంచ్‌లు కలిసి, మనకు సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థను వారసత్వ సంపదగా ఇచ్చాయని జస్టిస్‌ లక్ష్మణన్‌ చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలని అన్నారు. కాగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై న్యాయవ్యవస్థ, రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతున్న వేళ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed