కానిరాజ్యంలో కన్నుమూత.. కడసారిచూపు కరువు

by Shyam |
కానిరాజ్యంలో కన్నుమూత.. కడసారిచూపు కరువు
X

దిశ, నిజామాబాద్:
కరోనా మహమ్మారి తన ఎఫెక్ట్ సంస్థలు, ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాదు..హ్యూమన్ ఎమోషన్స్‌పైనా చూపుతోంది. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారు ఆ వ్యాధి బారిన పడి మరణిస్తే వారిని కడసారి చూసేందుకు కుటుంబీకులు నోచుకోవడం లేదు. దీంతో ఆ బాధిత కుటుంబీకులు విలపిస్తున్నారు. కనీసం చివరి చూపైనా తమకు దక్కడం లేదని అంటున్నారు. సాధారణంగా ఎవరైనా మరణిస్తే శత్రువులైనా తప్పక కడచూపునకు వస్తారు. కానీ, ప్రస్తుతం కరోనా చేయబట్టి కుటుంబీకులే మృతదేహాన్ని చూసే పరిస్థితులు లేవు. భారత్ కంటే ముందే గల్ఫ్ దేశాల్లో కరోనా కరాళ నృత్యం ప్రారంభమైంది. ఆ దేశాల్లో కరోనా బారిన పడిన వారిలో సగానికి పైగా మంది ఉపాధికి వలస వచ్చిన వారేనంట. తెలంగాణ వాసులకే సుమారు పది వేల మందికి కరోనా సోకిందన్న సమాచారంతో బాధితుల కుటుంబీకుల్లో విషాదం నెలకొంది.

సోషల్ మీడియాలో మృతదేహాలు చూసి..

గతంలో ప్రమాదంలోనో లేదా అనారోగ్యంతోనో చనిపోతే 3 లేదా 6 నెలలకయినా కచ్చితంగా స్వదేశానికి మృతదేహాన్ని ఖననం కోసం పంపించేవారు. కడసారి చూపునకు ఇక్కడ మృతుని కుటుంబీకులు ఎదురు చూసేవారు. అయితే, ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా అక్కడ చనిపోయిన వారిని అక్కడే ఖననం చేస్తుండటంతో కుటుంబీకులకు చివరి చూపు కరువైంది. అప్పోసప్పో చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి 4 రూపాయలు సంపాదించుకుని తిరిగి వద్దామని గల్ఫ్ దేశాలకు తెలంగాణ నుంచీ వెళ్లిన వారున్నారు. అందులో కొందరు కరోనా బారిన పడితే స్థానికంగా ఉన్న మిత్రులు, సన్నిహితులు ద్వారా సోషల్ మీడియాలో వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గల్ఫ్ దేశాల్లో ఇటీవల మృతి చెందారు. ఆ ముగ్గురు వ్యక్తుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది.

నందిపేట్ మండలం డొంకశ్వర్ గ్రామానికి చెందిన బజార్ గంగాసాయిలు ఆరు నెలల కిందట బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే వైరస్ బారిన పడి ఆస్పత్రిలో మృతి చెందాడు. సాయిలు దుబాయికి వెళ్లినప్పుడు ఆయన భార్య నిండు గర్భణి. ఆయన అక్కడకు వెళ్లిన తర్వాత పుట్టిన కుమార్తెను చూసుకోకుండానే సాయిలు మరణించాడు. కరోనాతో మృతి చెందడంతో కుటుంబీకులు కడసారి చూపు చూడలేకపోయారు.

ఆర్మూర్‌కు చెందిన గోసంగి రాజు ఏప్రిల్ 21న దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబీకులకు సమాచారం అందింది. అయితే, అక్కడి అధికార యంత్రాంగం రాజు మృతదేహానికి పరీక్షలు నిర్వహించడంతో కొవిడ్ అని తేలింది. దాంతో అప్పటి వరకు రాజును కడసారి చూస్తామనుకున్న కుటుంబీకుల ఆశలు ఆవిరయ్యాయి. రాజు మృతదేహాన్ని స్వదేశానికి పంపబోమనీ, కుటుంబీకుల అనుమతితో అక్కడే ఖననం చేస్తున్నట్లు అధికారులు సమాచారం అందించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన నితిన్ 4 నెలల కిందట ఉపాధి కోసం సౌదీ‌ఆరేబియాకు వెళ్లాడు. అతను వెళ్లిన కొద్దిరోజులకే ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పని దొరక్క క్యాంపునకే పరిమితమయ్యాడు. అయితే, అతనికి వైరస్ సోకిందేమోనన్ భయం పట్టుకుంది. రెండుసార్లు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దాంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. అయినా ఆస్పత్రిలో చేర్పించుకోండని ఆయన పట్టుబట్టడంతో అక్కడున్నవారు దాతల సహాయంతో అతన్ని ఆస్పత్రిలో అడ్మింట్ చేశారు. చికిత్స పొందుతుండగానే నితిన్ మృత్యువాత పడ్డాడు. మృతదేహానికి పరీక్షలు నిర్వహించారు. కానీ, రిపోర్టులు రాలేదు. వాటితో కొవిడ్ సోకిందా? లేదా? అనేది తేలుతుంది. నితిన్‌కు భార్య, కుమారుడు, తల్లిదండ్రులున్నారు.
కరోనాతో మృతి చెందిన సాయిలు, గోసంగి రాజు కుటుంబీకుల నుంచి ఎన్‌వో‌సీ(నిరభ్యంతర పత్రం) ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం కోరింది. అయితే, అప్పటికే వారు ఎన్‌వోసీ ఇవ్వడంతో అంత్యక్రియలు ఆ దేశంలోనే పూర్తి చేశారు. నితిన్ కుటుంబీకులనూ అక్కడి ప్రభుత్వం ఎన్‌వోసి కోరినట్లు తెలిసింది.

Tags: funeral, conducting, at gulf countries, family members, not seeing, dead bodies, covid 19 effect, lock down

Advertisement

Next Story