టీఆర్ఎస్ లో చేరిన తెల్లారే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి

by Sridhar Babu |
Mothkupalli12
X

దిశ ప్రతినిధి, నల్లగొండ/యాదగిరిగుట్ట: దేశంలో కులవ్యవస్థను పెంచి పోషిస్తోంది బీజేపీనే అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్టలో మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును బీజేపీనే అడ్డుకుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు. దళిత బంధును అడ్డుకున్న ఈటల రాజేందర్‌ను అడుగడుగునా అడ్డుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. యావత్ దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచేరోజు రాబోతుందని జోస్యం చెప్పారు. దళిత బంధు కొత్త పథకం కాదని, ఇది ఏడాది క్రితమే అమలైందని ఆయన తెలిపారు. ఈటలకు ఓటేస్తే ఓరిగేది ఏమీలేదని అన్నారు. కేంద్రం, బీజేపీల కుట్రను హుజూరాబాద్ ప్రజలు గమనించాలని, ఎన్నికల పేరుతో దళిత బంధును కేంద్రం నిలిపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకం అనేది కొనసాగే పథకమని గుర్తు చేశారు. అన్నివర్గాల ప్రజలకు దళిత బంధు తరహాలో కొత్త పథకాలు రాబోతున్నాయని, కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందుల్లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మోత్కూపల్లి అన్నారు.

Advertisement

Next Story