దుబ్బాక ఉప పోరుకు సర్వం సిద్ధం

by Shyam |
దుబ్బాక ఉప పోరుకు సర్వం సిద్ధం
X

దిశ, సిద్దిపేట:
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు.. హక్కు మాత్రమే కాదనీ బాధ్యత కూడా అని జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోళికేరి అన్నారు. ఆ ఓటు హక్కుకు సార్థకత వచ్చేలా బాధ్యతను విస్మరించకూడదని ఆమె అన్నారు.

సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….దుబ్బాక నియోజక వర్గంలో 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ తమకే ఓటు వేయ్యాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, నిబంధనలను ఉల్లంఘించినా వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి సీ-విజిల్ (CVIGIL)లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. వాటికి సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్‌లో అప్ లోడ్ చేసి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారా మిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 2000 మంది అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు లేని వారందరూ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి వారి వారి స్వస్థలాలకు వెళ్లి పోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ప్రజలు 200 మీటర్ల అవతల వారి వాహనాలను పార్క్ చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో (315) పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వాటిలో క్రిటికల్/సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు (89), సాధారణ పోలింగ్ కేంద్రాలు (226) ఉన్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాలు పాటించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి‌, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed