- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ వేలంలో ఆశ్చర్యకరమైన కొనుగోళ్లు
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ నిర్వహించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో తొలి అంకం గురువారం పూర్తయ్యింది. చెన్నైలో జరిగిన మినీ వేలంలో ఎన్నో ఆశ్చర్యకరమైన కొనుగోళ్లు, ఊహించని ధరలు చోటు చేసుకున్నాయి. వేలాన్ని పూర్తిగా గమనిస్తే అన్ని ఫ్రాంచైజీలు బౌలర్లు, ఆల్‌రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. క్రిస్ మోరిస్ వంటి అందరికీ తెలిసిన ఆల్‌రౌండర్‌ను రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం ఒక షాకైతే.. ఎవరికీ తెలియని రిలీ మెరిడిత్, చేతన్ సకారియాలు భారీ మొత్తానికి అమ్ముడు పోవడం మరో విషయం. ఇక సచిన్ కొడుకు అర్జున్ రూ. 20 లక్షలకే అమ్ముడు పోవడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నా.. అది అతడికి ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని అందించిందో అక్క సారా వివరించింది. ఇలాంటి ఐపీఎల్ కథలు కొన్ని మీ కోసం..
తమ్ముడుంటే బాగుండు..
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతన్ సకారియాను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. సౌరాష్ట్ర రంజీ జట్టుకు చెందిన చేతన్.. జయదేవ్ ఉనద్కత్ గాయపడటంతో 2018-19 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుపెట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 5 వికెట్లతో, సీజన్‌లో 30 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి టాలెంట్ గమనించిన ఆర్సీబీ నెట్ బౌలర్‌గా ఛాన్స్ ఇచ్చింది. అప్పుడే కోచ్ మైక్ హెసన్, సైమన్ కటిచ్‌లు సకారియాలో ఉన్న ప్రతిభను గుర్తించారు. ఈ సారి ఎలాగైనా ఐపీఎల్‌కు ఎంపికవుతాయని చెప్పారు. మినీ వేలంలో సకారియాను కొనుగోలు చేయడానికి ఆర్సీబీతో పాటు రాజస్థాన్ పోటీపడ్డాయి. చివరకు రూ. 1.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. కాగా నెల రోజుల క్రితం సకారియా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో అతని తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రోఫీ జరుగుతున్నన్ని రోజులూ తమ్ముడు ఎక్కడని ఫోన్లో అడిగినా కుటుంబ సభ్యులు తెలియజేయలేదు. ఇంటికి వెళ్లాకే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ‘ఈ రోజు నా తమ్ముడు ఉండుంటే చాలా సంతోషించే వాడు’ అని సకారియా భావోద్వేగానికి గురయ్యాడు.
ప్రీతీ జింటా టీమ్‌లో షారుక్ ఖాన్..
మినీ వేలంలో తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగానే సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారింది. షారుక్ ఖాన్‌ను ప్రీతీ జింటా రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిందంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. షారుక్ తండ్రి మసూద్ ఒక క్లబ్ క్రికెటర్. అజరయ్యా ప్రభాకర్ అనే కోచ్ దగ్గర ఒక మంచి ఆల్‌రౌండర్‌గా షారుక్ ఎదిగాడు. 13వ ఏట నుంచే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న షారుక్.. 2014లో తమిళనాడు తరపున విజయ్ హజారే ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. 2018-19 సీజన్‌లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన షారుక్ మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు విజయం సాధించడానికి ముఖ్య పాత్ర పోషించింది షారుక్ ఖాన్. ధోనీ తర్వాత మంచి ఫినిషర్‌గా మారే లక్షణాలు షారుక్‌లో ఉన్నాయని అతడి ఆట చూసిన ప్రతీ ఒక్కరు చెబుతారు. ‘నా పేరు షారుక్ అయినా తాను రజనీకాంత్‌కు పెద్ద ఫ్యాన్‌ని. అనిల్ కుంబ్లే కోచింగ్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’ అని షారుక్ అన్నాడు.
ఒక్క బాల్‌కి 17 రన్స్.. ఇతడిని ఎవరైనా కొంటారా?
బిగ్ బాష్ లీగ్ 2019వ సీజన్‌లో హోబర్ట్ హరికేన్స్ తరపున ఆడుతున్న ఒక బౌలర్ ఒక్క బాల్‌కు 17 పరుగులు ఇచ్చాడు. అతడు చేసిన నాలుగో బంతికి 6 వైడ్లు, 10 నోబాల్స్, ఒక సింగిల్ ఇచ్చాడు. ఆ బౌలర్ తర్వాత టీమ్‌లో ఉండటమే ఎక్కువ. కానీ ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతడే ఆసీస్ యువ క్రికెటర్ రిలే మెరిడిత్. టాస్మానియాకు చెందిన ఈ యువ ఆటగాడి కోసం పోటీ పడటానికి కారణం ఈ ఏడాది బీబీఎల్‌లో అతడి అద్భుతమైన ప్రదర్శనే. పంజాబ్ టీమ్‌లో సరైన విదేశీ బౌలర్ లేకపోవడంతో కొత్త వారి కోసం వెతుకుతున్నది. గత సీజన్‌లో క్రిస్ జోర్డాన్ అనుకున్న మేర రాణించలేదు. మహ్మద్ షమీకి తోడుగా మరో పేసర్ లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ మెరిడిత్ కోసం గట్టిగా పోటీపడి దక్కించుకున్నది. అతడిని కొనుగోలు చేయడంపై ప్రముఖ్య వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఆశ్చర్యపోయాడు. కానీ పంజాబ్ యాజమాన్యం మాత్రం మెరిడిత్ కొనుగోలు ఒక మంచి ఛాయిస్ అని వ్యాఖ్యానించింది.
తండ్రితో పోల్చొద్దు..
ఐపీఎల్ మినీ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించింది సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్. ముంబయి ఇండియన్స్ జట్టుకు గత కొన్ని సీజన్లుగా నెట్ బౌలర్‌గా ఉంటూ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయి రంజీ జట్టులో కూడా చోటు సంపాదించిన అర్జున్.. ఐపీఎల్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశాడు. ఎడమ చేతి వాటం ఆల్‌రౌండర్‌గా ఇప్పటికే పలువురి దృష్టిని ఆకర్షించిన అర్జున్‌ను ముంబయి ఇండియన్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అర్జున్‌ను కనీస ధరకే కొనుగోలు చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ, ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ కనీస ధరే పలకడం సాధారణమే. సచిన్ కొడుకు అనే ట్యాగ్ వల్ల అర్జున్ రేటును చూసి అందరూ కామెంట్లు చేస్తున్నా.. ఒక యువక్రికెటర్ ఐపీఎల్‌కి ఎంపిక కావడమే అతడు సాధించిన విజయం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ సోదరి సారా కూడా తమ్ముడిని అభినందించింది. ‘నువ్వు సాధించిన ఘనతను ఎవరూ నీ దగ్గర నుంచి తీసుకోలేరు. నీ రక్తంలోనే క్రికెట్ ఉంది. ఇన్నాళ్లు నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగావు. ఇక 22 గజాల పిచ్‌పై తుఫాన్ సృష్టించడానికి సిద్దంగా ఉండు’ అని సారా ట్వీట్ చేసింది. అర్జున్ ఎడమ చేసి పేసర్, బ్యాట్స్‌మాన్ కావడంతో అతడిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు మహేళ జయవర్దనే, జహీర్ ఖాన్ తనతో ముందుగానే చెప్పినట్లు ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ చెప్పారు.