ఇకపై కరోనా పరీక్షలు మన దగ్గరే

by Shyam |
ఇకపై కరోనా పరీక్షలు మన దగ్గరే
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రం మరింతగా సిద్ధమవుతోంది. విదేశాల నుంచి వచ్చేవారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచడానికి వికారాబాద్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాకేంద్రాల్లోనూ ఇలాంటి కేంద్రాలను సిద్ధం చేసేలా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటిదాకా కరోనా నిర్ధారణ కోసం అనుమానితుల శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతున్న ప్రభుత్వం ఇకపై ఇక్కడే పరీక్షలు చేసేలా ల్యాబ్‌లను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రితోపాటు ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రుల్లో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన కిట్‌లతో పాటు ఇతర ఉపకరణాలను కూడా సిద్ధం చేసింది. ఇక సిబ్బంది (టెక్నీషియన్‌లు)ని సమకూర్చుకుని లాంఛనంగా ప్రారంభించడమే తరువాయి.

దీనికితోడు గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఐసోలేషన్ కోసం సిద్ధం చేసిన 90 పడకలతోపాటు అదనంగా మరో 65 పడకలను కూడా సిద్ధం చేస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఈ వార్డుల్లో చేర్చి చికిత్స అందించడానికి వీలుగా తగిన పారా మెడికల్ సిబ్బందిని కూడా కేటాయిస్తోంది. అవసరాన్ని బట్టి బెడ్‌ల సంఖ్యను పెంచడం కోసం ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డును కూడా మరో చోటికి తరలించి దాన్ని ఐసోలేషన్ వార్డుగా ఉపయోగించుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్నవారికే కరోనా లక్షణాలు ఉన్నాయి తప్ప వారి ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు అంటుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లోనూ క్వారంటైన్ కేంద్రాలు:

అన్ని జిల్లాల్లోనూ క్వారంటైన్ కేంద్రాలను నెలకొల్పే కార్యక్రమం ఊపందుకుంటోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చైనా, జర్మనీ, ఇరాన్, ఇటలీ, ఇండోనేషియా తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విధిగా 14 రోజులపాటు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచేలా చర్యలు జరుగుతున్నాయి. వికారాబాద్‌లోని అటవీ పరిశోధనాకేంద్రం, హరిత హోటల్, గచ్చిబౌలి స్టేడియంల సామర్థ్యానికి మించి ప్రయాణికులను క్వారంటైన్ చేయాల్సి వస్తే ఆ ప్రయాణికులు ఏ జిల్లాకు చెందినవారైతే ఆ జిల్లా కేంద్రాల్లోనే ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమేకాక సిబ్బందిని కేటాయించడంపైనా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. క్వారంటైన్ కేంద్రంలో ఉండే 14 రోజులకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ప్రయాణికులపై ఆర్థిక భారం పడవద్దనేదే ప్రభుత్వ ఉద్దేశం.

విదేశీ ప్రయాణికులకే కరోనా:

తెలంగాణలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైనా ఇందులో ఒక్కరికి కూడా వైరస్ మూలం తెలంగాణలో లేదని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని గుర్తుచేశారు. తొలి పాజిటివ్ కేసు దుబాయ్ వెళ్ళి వచ్చిన ప్రయాణికుడిదైతే, ఆ తర్వాత నాలుగు పాజిటివ్ కేసులు ఇటలీ, ఇండోనేషియా, స్కాట్లాండ్, నెదర్లాండ్ దేశాల నుంచి వచ్చినవారివని మంత్రి నొక్కిచెప్పారు. వారి ద్వారా తెలంగాణ స్థానికులకు ఎవ్వరికీ ఈ వ్యాధి సోకలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలు, ప్రజల్లో కల్పించిన అవగాహన, వారిని అప్రమత్తం చేయడం వలన స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం లేకుండాపోయిందన్నారు.

హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో చాలా ముందుచూపుతోనే థర్మల్ స్క్రీనింగ్ మెకానిజంను ఏర్పాటు చేశామని, ఇప్పటిదాకా 66,162 మందికి పరీక్షలు చేశామని, ఇందులో 4,160 మందికి కరోనా పోలిన లక్షణాలు ఉన్నట్లు తేలడంతో అనుమానిత కేసులుగా వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమాన సేవలను నిలిపివేయనున్నట్లు మంత్రి ఈటల సూచించారు.

Tags : Telangana, Corona, Isolation Wards, Gandhi Hospital, Quarantine Centre, Testing labs, Pune

Advertisement

Next Story

Most Viewed