లేఖపై స్పందించిన ఈటల రాజేందర్..

by Anukaran |   ( Updated:2021-06-25 08:11:37.0  )
లేఖపై స్పందించిన ఈటల రాజేందర్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను లేఖ రాసినట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అది నకిలీ ఉత్తరమని, దాన్ని తాను రాయలేదని స్పష్టం చేశారు. తాను రాసినట్లుగా, తన పేరుతో ఉన్న లెటర్ హెడ్‌ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్యాలు ప్రచారం చేసి తన ప్రతిష్ట, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆ లెటర్ ను సర్క్యులేట్ చేస్తున్న వారిపైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉండగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న ఈటల రాజేందర్ ఈ నకిలీ లేఖపై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను లేఖ రాసినట్లు తప్పుడు ప్రచారం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ లేఖను సృష్టించడంపైనా ఫైర్ అయ్యారు. దీనిపై కొన్ని పత్రికలు అత్యుత్సాహం, ప్రదర్శించడంపైనా కూడా అసహనం వ్యక్తం చేశారు. సిగ్గుమాలిన పనులకు తెగించేవారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

వీణవంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు..

ఎల్భాక గ్రామానికి చెందిన మాడ సాధవరెడ్డి (తండ్రిపేరు మల్లారెడ్డి) మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరుతో ఉన్న లెటర్‌ హెడ్‌పైన స్వయంగా సంతకం చేసి రాసినట్లుగా పేర్కొనే లేఖను ప్రెస్ అండ్ పొలిటికల్ మరియు పోలీస్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో శుక్రవారం (జూన్ 25, 2021) ఉదయం 10.30 గంటలకు పోస్టు చేశాడు. దీనిపై వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రఘు (తండ్రి పేరు రాజవీరు) వీణవంక పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది నకిలీ లెటర్ హెడ్ అని, సంతకం కూడా ఫోర్జరీ చేశారని, ఈటల రాజేందర్ గౌరవ మర్యాదలను, ఆత్మగౌరవాన్ని రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఈ లెటర్‌హెడ్‌ను తయారుచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లెటర్ పోస్టు చేసిన వారిపైనా, వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేసిన మాడ సాధవరెడ్డిపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని కాపాడి తగిన న్యాయం చేయాలని కోరారు.

సైబర్ క్రైమ్ దర్యాప్తు తర్వాత క్లారిటీ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల రాజేందర్ మంత్రి హోదాలో ఉన్నప్పటి లెటర్‌హెడ్ మీద ఆకుపచ్చ ఇంకుతో సంతకం చేసిన లెటర్ వివాదాస్పదంగా మారింది. ఆ లెటర్‌ను తాను రాయలేదని స్వయంగా ఈటల రాజేందర్ ప్రకటించడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్ఠను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రతో సృష్టించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నకిలీ లెటర్‌ను సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ విభాగం దర్యప్తు ప్రారంభించిన తర్వాత ఈ లెటర్ రాసిందెవరో, వారికి ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఏ ఉద్దేశంతో ఈ నకిలీ లెటర్‌ను సృష్టించాల్సి వచ్చిందో.. ఇలాంటి వివరాలన్నీ వెలుగులోకి రానున్నాయి.

కేసీఆర్‌కు ఈటల సంచలన లేఖ వైరల్

Advertisement

Next Story