కేంద్ర ప్రకటనపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2021-08-04 07:55:55.0  )
కేంద్ర ప్రకటనపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, వరంగల్: 2031 వరకు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉండదన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెనుక రాజకీయ కుట్ర దాగి వుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. బుధవారం హనుమకొండ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలంగా లేకపోవడంతో ఈ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచకుండా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని విమర్శించారు. కాశ్మీర్ లో సీట్లు పెంచేందుకు ప్రక్రియను వేగవంతం చేశారని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇక్కడ కూడా జరగాల్సి ఉన్నా కేంద్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడానికి కారాణాలేంటో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు లేని అడ్డు తెలుగు రాష్ట్రాలకు ఎందుకంటూ ప్ర‌శ్నించారు.

రాజ్యాంగంలోని 170 కి లోబడి, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 (1) ప్రకారం ఏపి లో 175 సీట్లను 225కు, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాల‌ని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26 లోని ‘సబ్జెక్టు’ (170 ఆర్టికల్ కు లోబడి) అనే పదాన్ని తొలగించి ‘నాట్ విత్ స్టాండింగ్’ అనే పదాన్ని చేర్చి, సీట్లను పెంచే అవకాశం ఉంద‌ని అన్నారు. చట్ట సవరణ చేసి, తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపి లో చేర్చలేదా?.. రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ సీట్లను పెంచలేదా? అంటూ కేంద్రాన్ని విమ‌ర్శించారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం వైఖరిలో మార్పు లేకుంటే పార్లమెంట్ లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య ను ఎందుకు పెంచ‌రని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్రం తన మొండి వైఖరిని మరోసారి చాటుకుంటోంద‌ని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కుతున్నద‌ని ఆరోపించారు. 2026 అనంతరం జనాభా లెక్కలు గెజెట్ లో వచ్చాకే సీట్లు పెంచుతామని అనడం ఏకపక్ష నిర్ణ‌య‌మ‌ని అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కే. కేశవరావుతో కలిసి మన ఎంపీలు అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన విషయం గుర్తు చేశారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, ఈ రెండు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు, నేత‌లు ఇప్పుడు మాట్లాడాలంటూ బండి సంజ‌య్ ఇత‌ర నేత‌ల‌ను ఉద్దేశించి అన్నారు. సమావేశంలో స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, గ్రేటర్ వరంగల్ మహానగర పాలకసంస్థ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed