పెద్దిరెడ్డి పయనమెటు.. కమలమా.. గులాబీ గూటికా ?

by Sridhar Babu |   ( Updated:2023-10-10 16:08:23.0  )
Enugala Peddi Reddy latest news
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పయనమెటూ అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చకు దారి తీసింది. రాష్ట్ర రాజకీయమంతా హుజురాబాద్ కేంద్రీకృతంగా సాగుతుండడంతో ఇప్పుడు అందరి కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి. ఇందుకు తోడు ఇటీవల ఈటల బీజేపీ ఎంట్రీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజురాబాద్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్న తనకు ఇదే నియోజకర్గానికి చెందిన ఈటలను బీజేపీలో చేర్పించుకునే విషయం గురించి చెప్పకపోవడంతో క్రమశిక్షణతో మెదిలే బీజేపీలో ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు.

దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డీకే అరుణ పెద్దిరెడ్డితో చర్చలు జరిపి శాంతింపచేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బీజేపీలోనే కొనసాగుతారా.. లేక వేరే పార్టీలోకి జంప్ చేస్తారా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. పెద్దిరెడ్డిని ఈటలకు పోటీగా నిలిపితే ఎలా ఉంటుందని, ఆయన గెలిచి తీరుతాడా అన్న వివరాలను టీఆర్ఎస్ వర్గాలు సేకరిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పెద్దిరెడ్డి కూడా అన్ కండీషనల్‌గా టీఆరెఎస్‌లో చేరుతున్నారని, ఈ మేరకు హరీష్ రావుతో చర్చలు కూడా జరిపారని లీకులు ఇస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి టీఆరెఎస్ లో చేరడం ఖాయమైపోయిందన్న ప్రచారమూ సాగుతోంది.

సర్వేల స్పెషలిస్ట్…

ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకోవడంపై పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ప్రతి ఎన్నికలకు ముందూ సీక్రెట్ సర్వే చేయించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటారు. ఈటల ఎపిసోడ్ తర్వాత కూడా సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఆయన హుజురాబాద్ టూర్ కూడా చేస్తుండడం గమనార్హం. ఏంటి సార్ పర్యటన వెనక ఆంతర్యం అన్న చర్చ ఆయన అనుచరుల్లో మొదలైంది. ఎన్నికల గురించే ఫాలోవర్స్ తో చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్న వారూ లేకపోలేదు.

మూడో “సారీ” యేనా..

హుజురాబాద్ నుండి ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి తన బ్రాండ్ ఇమేజ్ ను కూడా అక్కడ క్రియేట్ చేసుకున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ఇప్పటికీ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. అయితే ఆయనకు 2014 నుండి అంతగా కలిసి రావడం లేదు. టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ చివరి క్షణంలో ఆయన పోటీ చేయని పరిస్థితులే తయారయ్యాయి. 2014 ఎన్నికల్లో హుజురాబాద్ నుండి పెద్దిరెడ్డి పేరు అభ్యర్థిగా ప్రకటించినట్టే అయింది. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. తన తండ్రికి ఉన్న ఇమేజ్ తో గెలిస్తానని, తమ కుటుంబానికి మాట ఇచ్చిన విషయం మరిచిపోవద్దని కశ్యప్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేయడంతో చివరి క్షణంలో కశ్యప్ రెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.

2018 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా హుజురాబాద్ కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో ఆయననకు కూకట్ పల్లి నుండి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో కూకట్ పల్లిలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న క్రమంలో మరోసారి షాకిచ్చారు టీడీపీ అధినేత. అక్కడి నుండి పోటీ చేసేందుకు హరికృష్ణ కూతురు ఉత్సాహం చూపడంతో పెద్దిరెడ్డిని పక్కన పెట్టారు. 2018 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఈటల రూపంలో నిరాశ ఎదురైంది. టీఆరెఎస్ పార్టీలో జరిగిన అనూహ్య పరిణామాలతో రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కూడా ఆయనే అని ప్రకటించారు. దీంతో పెద్దిరెడ్డి పయనం ఎటూ అన్న చర్చే సాగుతోంది.

ఆహ్వానం లేదు: పెద్దిరెడ్డి

టీఆర్ఎస్ పార్టీ నుండి ఇంతవరకూ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పెద్దిరెడ్డి “దిశ’ ప్రతినిధితో చెప్పారు. ఒక వేళ గులాబి బాస్ నుండి పిలుపొస్తే మీ రెస్పాన్స్ ఏమిటి అని అడగగా అలాంటి పరిస్థితి వస్తే ఆలోచిస్తామన్నారు.

Advertisement

Next Story