వాహ్ సూపర్.. కరోనాతో ఉపాధి

by Shyam |   ( Updated:2020-07-28 00:19:57.0  )
వాహ్ సూపర్.. కరోనాతో ఉపాధి
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే మనుషులు మాత్రమే కాదు, వారు నివసించే, పనిచేసే, సంచరించే ప్రాంతాలతోపాటుగా వాడే పరికరాలు, ఫర్నిచర్ను కూడా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే వారికి వ్యాపార సూత్రంగా మారింది. కరోనా సమాజానికి అనేక పాఠాలు నేర్పింది. అదే బిజినెస్ రూపకల్పనకు తెర తీసింది. ఐడియా ఉండాలే గానీ, ఏ పరిస్థితుల్లోనైనా వ్యాపారం చేయొచ్చని నిరూపించింది. శానిటైజ్ చేసేందుకు కూడా ఓ పెద్ద వ్యవస్ధ ఏర్పాటైంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు వారు మీ ఇంటికి, మీ ఆఫీసుకే వచ్చి పూర్తిస్థాయిలో యంత్రాల సాయంతో శానిటైజ్ చేసి వెళ్తారు. సొంతంగా ఏది శుభ్రం చేయాలన్నా భయపడేవారికి వీళ్లు కల్పించే సదుపాయం భలే బాగుంది.

అందుకే నగరాల్లో ఇలాంటి కంపెనీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో శానిటైజ్ చేసే సంస్థలు ఏర్పడ్డాయి. దాదాపు 200 మందికి కూడా ఉపాధి కల్పిస్తున్నాయి. గతంలో ఇతర రకాల వ్యాపారాలు చేసిన సంస్థలే ఇప్పుడీ రంగంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. జనం బాగా తిరిగిన ప్రదేశాన్ని శుభ్రం చేయడం ప్రమాదకరమే. మనుషులతో అన్ని మూలల్లో క్లీన్ చేయడమో, శానిటైజ్ చేయడమో సాధ్యం కాదు. అదే యంత్రాలైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పడా యంత్రాలతోనే శానిటైజ్ చేయడానికి మీ ఫోన్ కాల్ కోసం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

ఎక్కడెక్కడంటే..

విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఐటీ హబ్స్, జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, డ్యాన్స్ అకాడమిలు, మార్కెట్ ప్లేస్ లు..ఇండ్లు కూడా శానిటైజ్ చేసేందుకు మార్కెట్లో పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫోన్ చేసి చిరునామా చెప్తే చాలు. సిబ్బంది యంత్రాలను తీసుకొచ్చి శానిటైజ్ చేసేస్తున్నారు. వాళ్ల దగ్గర పీపీఈ కిట్లు, డూపాంట్ టైవెక్స్, హ్యాండ్ వాష్ లు, శానిటైజర్లు, సోడియం హైపోక్లోరైట్, బయో ట్రాప్, మాస్కులు, కస్టమైజ్డ్ మాస్కులు, హైడ్రోజన్ పేరాక్సయిడ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. యూఎల్ఎఫ్ ఫాగర్స్ వంటి యంత్రాలు కూడా లభిస్తున్నాయి. ఇటీవలనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినా జనం నుంచి మంచి స్పందన లభిస్తుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

శానిటైజేషన్ ధరలు

– ఆఫీసు స్పేస్ చదరపు అడుగు స్థలం: రూ.2
– డబుల్ బెడ్రూం 1250-1750 చ.అ.: రూ.1999
– త్రిబుల్ బెడ్రూం 1750- 2500 చ.అ: రూ.2499
– ఫోర్ బెడ్రూం 2500- 3250 చ.అ.: రూ.2749

రెస్పాన్స్ బాగుంది: అనిల్ రెడ్డి, డైరెక్టర్, గో శానిటైజ్ కంపెనీ

మేం కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాం. రెస్పాన్స్ బాగుంది. ప్రధానంగా ఆఫీసులు, బ్యాంకులు, ఇండ్ల నుంచి డిమాండ్ ఉంది. కోవిడ్-19 నిబంధనల మేరకు సానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరి. అందుకే మేం పూర్తి సైంటిఫిక్ మెథడ్ లో చేస్తున్నాం. మా దగ్గర 200 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఫోన్ కాల్ రాగానే సానిటైజ్ చేసి వచ్చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed