బెనిఫిట్ ఉంటుందా.. లేదా.!

by Anukaran |
బెనిఫిట్ ఉంటుందా.. లేదా.!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు ఊహల పల్లకిలో కొట్టుమిట్టాడుతున్నారు. 31 నెలల పాటు ఎదురుచూసిన వేతన సవరణ కమిషన్​ నివేదిక సీల్డ్​ కవర్​లో నిక్షిప్తమైంది. ఇందులోని వివరాలు ఎక్కడా లీక్​ కాకుండా కమిషన్​ జాగ్రత్తలు తీసుకుంది. సీఎం కేసీఆర్​తో భేటీ అయిన కమిషన్ నివేదికలోని అంశాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్​ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పీఆర్సీ, ఇతర అంశాలను చర్చించనప్పటికీ, త్వరలోనే శుభవార్త వింటారని సీఎం వారికి సూచించారు. అసలు పీఆర్సీ ఎంత ఉంటుందనే అంశం ఇప్పుడు ఉద్యోగవర్గాలలో ప్రధాన చర్చగా మారింది. కమిషన్​ తక్కువే సూచిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 2013లో 14 శాతమే ఫిట్​మెంట్ ఇవ్వాలని సూచించింది. సీఎం కేసీఆర్ మాత్రం​ 42 శాతం ఇచ్చారు. ఈసారి కూడా కమిషన్​ 15 నుంచి 21 శాతం మూడు స్లాబులలోనే ఫిట్​మెంట్​ ఇవ్వాలని పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగులు మాత్రం 63 శాతం డిమాండ్​ చేస్తున్నారు. సీఎం ఎక్కువే ఇస్తారనే భరోసాతో ఉన్నారు. ఉద్యోగవర్గాల మీద కేసీఆర్​ ఆగ్రహంగా ఉండటంతో ఎంత ఫిట్​మెంట్​ వస్తుందనేది అనుమానంగానే మారింది.

33 శాతం అయినా ఇవ్వాల్సిందే

2013లో 42 శాతం ఫిట్​మెంట్​ తీసుకున్న ఉద్యోగులు ఈసారి 33 శాతం వరకైనా తీసుకోవాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ ఆశతో ఉంటున్నా, కిందిస్థాయిలో మాత్రం 40 శాతం వరకు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ రెండున్నరేండ్లు ఆలస్యమైంది. జమపై ఇంకా క్లారిటీ రావడం లేదు. నగదు పెంపును 2019 జూలై నుంచి అమలు చేస్తారని, నగదు మాత్రం 2021 నుంచి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగులు ఏడాదిన్నర కాలాన్ని నష్టపోవాల్సిందే. గతంలోనే 11 నెలలు నష్టపోయారు. ఈసారి కూడా నష్టం జరిగితే చాలా ఇబ్బందులు ఉంటాయనే అంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం 30 నుంచి 33 శాతం కనీసం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. లేకుంటే క్షేత్రస్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి తప్పదని భయపడుతున్నారు.

ఆ కవర్​లో ఏముందో?

పీఆర్సీ నివేదికను సీల్డ్​ కవర్​లో అప్పగించారు. అధ్యయనానికి కమిషన్ 31 నెలల సమయం తీసుకుంది. గడువు కూడా సమీపించింది. సీఎం కేసీఆర్​ కూడా ఆదేశాలివ్వడంతో గురువారం సీఎస్​కు నివేదిక అప్పగించారు. సీల్డ్​ కవర్​ను ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీ ఓపెన్​ చేయాల్సి ఉంది. శుక్రవారమే సీల్డ్​ కవర్​ను ఓపెన్​ చేసి పరిశీలిస్తారని అనుకున్నారు. సీఎం కేసీఆర్​ కూడా అదే చెప్పారని తెలుస్తోంది. కానీ, త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు. సోమవారం ఓపెన్​ చేస్తారనుకుంటున్నారు. బుధ లేదా గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీకి ప్రతులను ఇస్తారని ఆశిస్తున్నారు. అనంతరం జేఏసీతో సీఎం మళ్లీ పిలిచి చర్చిస్తారనుకుంటున్నా, అనుమానాలైతే అలాగే ఉన్నాయి. జేఏసీతో చర్చించినా అంతగా ఉపయోగం ఉండదనే సంకేతాలు అందుతున్నాయి.

ప్రగతిభవన్​లో అసలేం జరిగింది..?

ప్రగతిభవన్​లో అసలేం జరిగిందనే అంశం మీద ఎక్కడా క్లారిటీ రావడం లేదు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్న వివరాలు ప్రకారం పీఆర్సీ అంశంపై అసలే చర్చించలేదని తెలుస్తోంది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడం, ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలు మాత్రం మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు చర్చించారు. దీనిపైనే సీఎం కేసీఆర్​ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజులలోనే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడంపై నిర్ణయం వెలువడనుంది. దీంతో పీఆర్సీ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టమైంది. టీజీఏ అధ్యక్షురాలు మమత కూడా ఈ విషయమే వెల్లడించారు. దీంతో ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంతో దావత్​ చేసుకునేంత సంబురం ఏముందంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

పీఆర్సీ వర్తింపు ఎలా?

అసలు పీఆర్సీ వర్తింపు ఎలా ఉంటుందనే మీమాంస ఉద్యోగులలో నెలకొంది. వాస్తవంగా 2018 జూలై నుంచి పీఆర్సీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన నగదు జమ ఎలా చేస్తారనేది తేల్చడం లేదు. 2018 జూలై నుంచి అమలు చేస్తారా లేదా అనేది కూడా సందేహంగానే మారింది. 2018 జూలై నుంచి వర్తింపచేస్తే ఉద్యోగులకు లాభమే. ప్రగతిభవన్​ సమాచారం మరోలా ఉంది. 2019 జూలై నుంచి వేతన సవరణ పెంపును అమలు చేస్తారని, నగదు జమ మాత్రం 2021 మార్చి నుంచి చేస్తారని ఒక ప్రచారం నడుస్తోంది. 2020 జూలై నుంచి పెంపును వర్తింపచేసి 2021 మార్చి నుంచే నగదు జమ చేస్తారని కూడా ప్రచారం కూడా ఉంది. ఈ లెక్కన అమలు చేస్తే ఉద్యోగులు దాదాపు రెండున్నరేండ్లు నష్టపోవాల్సి ఉంటోంది. పీఆర్సీ చరిత్రలో ఇదే అతిపెద్ద లాస్​గా ఉంటుదని ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు. 2013 పీఆర్సీ సందర్భంలోనే 11 నెలలు నష్టపోయారు. ఈసారి ఎలా అమలు చేస్తారనే ఆయోమయం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed