కమల్ హాసన్ కారులో ఎన్నికల అధికారుల సోదాలు

by Anukaran |   ( Updated:2021-03-22 11:33:26.0  )
Election officials search Kamal Haasans car
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంఎన్ఎం (మక్కల్​ నీది మయ్యమ్) అధినేత, ప్రముఖ నటుడు కమల్​హాసన్ ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సోమవారం రాత్రి తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్లయింగ్ స్క్వాడ్ బృందం ఆయన వాహనాన్ని తంజావూరు జిల్లాలో ఆపి సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఎలాంటి డబ్బు, మద్యం లభ్యం కాలేదు. కాగా అధికారులు ఎన్నికల విధుల్లో భాగంగానే సోదాలు చేసినట్లు తెలిపారు.

తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్న కమల్ హాసన్.. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో కమల్ హాసన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వాకర్స్ తో ఉదయపు నడకతో మొదలుకుని వేర్వేరు కార్యక్రమాల ద్వారా రోజంతా ఓటర్లను కలుసుకుంటున్నారు. చిరు వ్యాపారులతో ముచ్చటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి కమల్ పార్టీ ఎంఎన్‌ఎం 154 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 80 సీట్లలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న ‘ఆల్‌ ఇండియా సమతువ మక్కల్ కచ్చి’, ‘ఇంధియ జననయగ కచ్చి’ చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Advertisement

Next Story